కలిసిరాని ఖరీఫ్‌! | - | Sakshi
Sakshi News home page

కలిసిరాని ఖరీఫ్‌!

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

కలిసిరాని ఖరీఫ్‌! ● ఇటీవల వర్షాలతో మరో 10 వేల హెక్టార్లలో పెరిగిన విస్తీర్ణం ● గతేడాది 1.07 లక్షల హెక్టార్లలో సాగు ● ఈ ఏడాది భారీగా తగ్గుదల జిల్లాలో 71 శాతానికే పరిమితమైన పంటల సాగు

మేఘాల దోబూచులాటలు.. అప్పుడప్పుడు రెండు ఉరుములు.. మూడు మెరుపులు.. ఆపై ఎప్పుడో ఒకసారి నాలుగు చినుకులు.. పగలంతా భానుడి భగభగలు.. ఖరీఫ్‌ సీజనంతా కనిపించిన వాతావరణం ఇది. ‘ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాభావం.. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం.. వెరసి పంట సాగుకాక పుడమి తల్లి బోసిపోయింది. రైతును కరువు ముంగిట వదిలేసి ఖరీఫ్‌ నిరాశగా ముగుస్తోంది.
● ఇటీవల వర్షాలతో మరో 10 వేల హెక్టార్లలో పెరిగిన విస్తీర్ణం ● గతేడాది 1.07 లక్షల హెక్టార్లలో సాగు ● ఈ ఏడాది భారీగా తగ్గుదల

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ నిరాశజనకంగా ముగిసింది. తీవ్ర వర్షాభావానికి పాలకుల నిర్లక్ష్యం తోడై పంట ముందుకు ‘సాగ’లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో వంద శాతం సాగు కాలేదు. మరో 10 రోజుల్లో రబీ సీజన్‌ ప్రారంభం కానుంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,09,228 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 78,016 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణంలో 71 శాతం మేరకే సాగైంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 1.07 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం 1.09 లక్షల హెక్టార్లకుపైగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 78 వేల హెక్టార్ల వద్దే సాగు నిలిచింది.

వర్షాల కోసం ఎదురుచూపులు..

ఖరీఫ్‌ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో రైతులు పంటల సాగుకు వెనుకంజ వేశారు. వర్షాధార ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా ఈ సమయానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగాల్సి ఉండగా.. అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో లక్ష్యం చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో సుమారు 10 వేల హెక్టార్లలో అదనంగా పంటల సాగు పెరిగినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

డెల్టాపైనే భరోసా..

ప్రస్తుతం జిల్లాలో సాగు పరిస్థితులు ప్రధానంగా కృష్ణా పశ్చిమ డెల్టాపై ఆధారపడి ఉన్నాయి. డెల్టా పరిధిలో సాగునీటి లభ్యత, వర్షపాతం అనుకూలిస్తే మిగిలిన విస్తీర్ణంలోనూ పంటల సాగు పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులు డెల్టా ప్రాంతంలో నీటి పరిస్థితులపై ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడంతో రైతులు ఇప్పుడు రబీ సీజన్‌పై ఆశలు పెట్టుకున్నారు. రబీలోనైనా సాగునీటి లభ్యత, వర్షపాతం అనుకూలంగా ఉండి పంటల సాగు విస్తీర్ణం పెరగాలని కోరుతున్నారు. వ్యవసాయశాఖ కూడా మిగిలిన సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో కరువు మండలాలుగా టీడీపీ ప్రభుత్వం తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, వట్టి చెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరులను ప్రకటించింది.

గుంటూరు శివారులో పత్తి పంట (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement