గుంటూరు లీగల్: ఖైదీలకు ప్రభుత్వం, జైళ్లు తోడ్పాటు అందిస్తాయే కానీ పూర్తిగా మారాలంటే వారి ఆలోచనలు మారాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖైదీల సంక్షేమ దినోత్సవం, గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా జైలులో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రోజూ నిద్రించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, దాని వలన ఆలోచనలలో మార్పు వస్తుందని ఖైదీలకు సూచించారు. సత్ప్రవర్తన కలిగి ఉండి భవిష్యతులో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి తగిన సలహాలు, సూచనలు చేశారు. వారికి నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, జిల్లా జైలు సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ చాటుకున్న మండలంలోని మండెపూడికి చెందిన నందం సాయి రేడియంట్ వరల్డ్ పారా క్రికెట్ లీగ్–2026లో చైన్నె చార్జర్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సాయి గుంటూరు జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును మూడు సార్లు విజేతగా, రెండు సార్లు రన్నరప్‌గా నిలిపాడు. దివ్యాంగ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా సాయిని గుర్తించి రేడియంట్ వరల్డ్ పారా క్రికెట్ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించింది. ఈ నెల 6 నుంచి 11 వ తేదీ వరకు ఆగ్రాలోని జేబీ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జరిగే రేడియంట్ వరల్డ్ పారా క్రికెట్ లీగ్‌లో ఆయన ఆడనున్నారు. భారత్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన పారా క్రికెటర్లు కూడా పాల్గొంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో విజయాలు సాధించి నేడు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటున్న నందరం సాయికి గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.
లక్ష్మీపురం: రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం సామూహిక బాధ్యత అని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ సుధేష్ణసేన్ పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రైల్వే కార్మికులు, అవుట్ సోర్సింగ్, స్వచ్ఛంద సంస్థలు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో కలిసి శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో విద్యార్థులు వేసిన చిత్రాలను డీఆర్‌ఎం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా గుంటూరులో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యాలయాలతోపాటు గృహాల ఆవరణాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. అనంతరం రైల్వే సిబ్బంది, వారి కుటుంబాలు, సఫాయి మిత్రులచే స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: ప్రతిష్ఠాత్మక ఐసీఏఆర్–2026 పరీక్షలో బాపట్లకు చెందిన విద్యార్థిని చింతా కీర్తి రాయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 7వ ర్యాంక్ సాధించింది. చీరాలకు చెందిన కీర్తిరాయ్ బాపట్ల ఎన్టీఆర్ ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ కోర్సు అభ్యసిస్తున్నారు. కీర్తిరాయ్ తండ్రి పీటర్‌పాల్ మాట్లాడుతూ ఐసీఏఆర్ పరీక్షతో పాటు చైన్నె ఐఐటీకి సంబంధించిన పరీక్షలో కూడా ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ర్యాంక్ రావటంతో అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


