జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల ప్రదాన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా స్వచ్ఛత అవార్డులు పట్టణ, గ్రామీణ పారిశుద్ధ్య విభాగాలకు మాత్రమే పరిమితమవుతాయని గుర్తుచేశారు. ఈసారి అన్ని శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య ఆరోగ్య సంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజల్లో ఆదర్శంగా పనిచేస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, కార్యాలయం నుంచే ప్రారంభించాలన్నారు. అనంతరం కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జీఎంసీ అడిషనల్ కమిషనర్ కిషోర్, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల బాటలో నడవాలి
తెనాలి: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఇరువురు మహనీయుల జీవితాల నుంచి అనేక విషయాలు నేర్చుకొని, వారు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం అనేవి ప్రధానంగా నేర్చుకోవలసిన అంశాలని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి నిరాడంబరత, నిజాయితీ వంటి గుణాలను అలవర్చుకోవాలని చెప్పారు. ఉన్నతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన సాధారణ జీవితాన్ని గడిపారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా నిలబడ్డారని కొనియాడారు. వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే మనం వారికి అర్పించే నిజమైన నివాళిగా చెప్పారు. తెనాలి ఆర్డీవో కె.శ్రీరమణి, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.


