జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ వైద్యులను ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిపై సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పడాలన్నారు. అసంక్రమిత వ్యాధుల సర్వే ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో జరగాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని, సిజేరియన్ ప్రసవాలు తగ్గాలని చెప్పారు. మాతాశిశు మరణాల నివారణ ధ్యేయంగా పనిచేయాలన్నారు. జిల్లాను ప్రగతి పథంలో ఉంచేందుకు ప్రతి శాఖ కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో త్రీ స్టార్ రేటింగ్ పెరగాలన్నారు. డీడీయూ – జీకేవై నమోదులో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అంగన్‌వాడీలో పోషణ ట్రాకర్ మెరుగు పరచాలని చెప్పారు. ఈ–పంట నమోదు మూడు రోజుల్లో మెరుగుపడాలన్నారు. ‘సర్’ లో పెండింగ్ లో ఉన్న 19 నోటీస్‌లపై తక్షణం విచారణ చేసి మంగళవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశకాలు, నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి మాట్లాడుతూ పూర్వ కృష్ణ – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నోటీస్ జారీ చేశామని చెప్పారు. అన్ని ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో పెట్టాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ పి.శేష శ్రీ, డ్వామా పీడీ వి.శంకర్, వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు ఆంజనేయులు, డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, అధికారులు పాల్గొన్నారు.


