మంత్రి లోకేష్‌ను కలసిన అర్జున అవార్డు గ్రహీత | - | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేష్‌ను కలసిన అర్జున అవార్డు గ్రహీత

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

మంత్రి లోకేష్‌ను కలసిన అర్జున అవార్డు గ్రహీత మహిళ హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ బాలికపై లైంగికదాడి రైతునేస్తం పురస్కారాల– 2026కు దరఖాస్తులు అర్జీల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం

తాడేపల్లిరూరల్‌: భారత అంధుల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, అర్జున అవార్డు గ్రహీత అజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అజయ్‌ మాట్లాడుతూ తన నేతృత్వంలో భారత అంధుల క్రికెట్‌ జట్టు మూడుసార్లు ప్రపంచకప్‌ కై వసం చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలో అంధుల క్రికెట్‌ అభివృద్ధితో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్‌ అంధ క్రికెటర్లకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలీగల్‌: ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో లభ్యమైన మహిళ మొండేనికి సంబంధించిన కేసులో నిందితులకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ 5వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్టుక్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వివరాలు.. ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌ పంప్‌హౌస్‌ వద్ద కూలింగ్‌ కెనాల్‌లో మహిళ మొండెం తేలుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పశ్చిమ జోన్‌ డీసీపీ గుణ్ణం రామకృష్ణ, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుబ్రహ్మణ్యం ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి డ్రోన్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సాయంతో కెనాల్‌లోని శరీర భాగాలను వెలికితీశారు.

టాటూ ఆధారంగా..

అనంతరం మృతదేహం చేతిపై ఉన్న నెమలి పించెం టాటూ ఆధారంగా మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేయగా, మృతురాలు ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడకు చెందిన కర్రి దుర్గా కల్యాణి (29)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం మంగళగిరిలో నివసిస్తోంది. విచారణలో దుర్గ కల్యాణి ఒక హోటల్‌ యజమానితో సహజీవనం చేయగా బాబుకు జన్మనిచ్చి, ఆ బాబును భవానీపురం హెచ్‌.బి.కాలనీకి చెందిన మాంసం వ్యాపారి షేక్‌ షఫీ (46)కి దత్తత ఇచ్చింది. ప్రతిసారి డబ్బులు కావాలని వేధించడంతోపాటు బాబు విషయంలో గొడవలతో షఫీ ఈనెల 17న ఆమెను ఇంటికి పిలిచి, మటన్‌ కత్తితో హత్య చేశాడు. దీనికి అతని స్నేహితుడు షేక్‌ అబ్దుల్లా అలియాస్‌ దుర్గారావు సహాయం తీసుకొని, మృతదేహాన్ని ముక్కలు చేసి తుమ్మలపాలెం, గొల్లపూడి కూలింగ్‌ కెనాల్‌లో పడేశాడు. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.

కేపీహెచ్‌బీకాలనీ: మాయమాటలు చెప్పి బాలికను గర్భణిని చేసిన ఓ యువకుడిపై కేపీహెచ్‌బీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఏడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో నగరానికి వలస వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుమార్తె, కుమారుడిని చదివిస్తోంది. కుమార్తె(17) కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. ఇటీవల తమ సమీప గ్రామానికి చెందిన వెంకట్‌ చందు(21) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పరిచయమయ్యాడు. చందు అమీర్‌పేటలో నివసిస్తూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పరిచయం పెరిగి బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో తరచూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమె గర్భిణి అయింది. వెంకట్‌ చందు గర్భ నిరోధక మాత్రలు ఇవ్వడంతో గర్భ విచ్చిత్తి జరిగింది. ఇటీవల బాలిక మళ్లీ గర్భం దాల్చి తరచూ కడుపు నొప్పి అంటుండటంతో తల్లి గట్టిగా నిలదీసింది. విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయిన తల్లి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు వెంకట్‌ చందుపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా కేసు నమోదు నాటికి ఆ బాధితురాలి వయస్సు 18 సంవత్సరాలు అయినప్పటికీ ఆరు నెలల గర్భం దాల్చటంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు రూరల్‌: రైతునేస్తం పురస్కారాలకు అక్టోబర్‌ 31లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్‌, రైతులు రైతునేస్తం వెబ్‌సైట్‌ హెచ్‌టీటీపీ://రైతునేస్తం.ఇన్‌/అవార్డ్స్‌ నుండి అప్లికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్‌ 31వ తేదీలోగా ఎడిటర్‌, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ 500004. ఫోన్‌ నంబర్‌ 9676797777 (లేదా) రైతునేస్తం డోర్‌ నంబర్‌ 8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ 522017, ఫోన్‌: 97053 83666 చిరునామాలకు పంపగలరని తెలిపారు. లేదా ఎడిటల్‌ఃరైతునేస్తం.ఇన్‌కు ఇ–మెయిల్‌ చేయవచ్చని తెలిపారు.

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం లో నిబంధనలకు లోబడుతూనే మానవత్వంతో పరిశీలించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసమై వస్తుంటారని, అటువంటి వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతోపాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. అనంతరం వచ్చిన 301 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో షేక్‌ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, డ్వామా పీడీ శంకర్‌, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణ, ఇతర శాఖల జిల్లా అధికారులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement