రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

తాడికొండ: ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) సంయుక్త ప్రతినిధుల బృందం రాజధానిలో మూడు రోజులపాటు పర్యటన నిమిత్తం విచ్చేసింది. ఈ పర్యటనలో భాగంగా చేపట్టిన నాలుగో జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ సపోర్ట్‌ మిషన్‌లో భాగంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు రాజధానిలో ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్‌, ఏజీఐసీఎల్‌ అధికారులతో బ్యాంక్‌ ప్రతినిధుల బృందం పలు సమావేశాలు నిర్వహించనుంది. ఈ పర్యటనలో భాగంగా అమరావతిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు పురోగతి, నిర్దేశించిన లక్ష్యాలు, ఆయా కార్యక్రమాల ఫలితాలు, నిధుల వినియోగం, భవిష్యత్‌ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ప్రతినిధుల బృందం సమీక్ష నిర్వహించనుంది. తొలి రోజు బుధవారం రాయపూడిలోని ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఆర్డీయే కమిషనర్‌ వి.విజయ రామరాజు, ఏడీసీఎల్‌ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి, అదనపు కమిషనర్లు ఎ.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, కొల్లాబత్తుల కార్తిక్‌, టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన సమావేశాలలో రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల అమలుకు సంబంధించిన సంస్థాగత వ్యవస్థ, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్‌ క్యాపిటల్‌ రీజియన్‌(ఐసీఆర్‌) ప్లాట్‌ఫామ్‌, అర్బన్‌ గవర్నెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌, ప్రస్తుత, భవిష్యత్‌ ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సమన్వయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్‌, ఏజీఐసీఎల్‌ అధికారులు అమరావతిలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల అమలు పురోగతికి సంబంధించిన వివరాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement