గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమన్వయంతో బుధవారం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో అంతార్జాతీయ సంకేత భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం ఉద్దేశ్యం సానుభూతి తెలియచేసే రోజుగా కాకుండా వారికి హక్కులను అందించే ఒక అవకాశంగా భావించాలన్నారు. వినలేని, మాట్లాడలేని వారు ఉపయోగించే సంకేత భాషను ప్రత్యామ్నాయ పద్ధతిగా కాకుండా సంకేత భాష, సంపూర్ణమైన భాషగా పరిగణించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని పదేపదే గుర్తు చేయకుండా వారికున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణప్ప, సమగ్ర శిక్షా అభియాన్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ సాయి, టీజేపీఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ శాస్త్రి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ డెఫ్ అసోసియేషన్ గుంటూరు ప్యానెల్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.


