గుంటూరు మెడికల్: పరిశుభ్రత ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని ఏపీపీసీబీ గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని సుమేధ హైస్కూల్‌లో బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. సుమేధ హైస్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ రెడ్డి, ఐటీసీ ఎం.ఎస్.కె.ఫినిష్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ శైలజ, పర్యావరణ విద్యా కోఆర్డినేటర్ డి.తిరుపతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


