చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్
పెదకాకాని: అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య, రేపటి ప్రపంచానికి నైపుణ్యం గల యువతను అందించడమే వీవీఐటీ విశ్వవిద్యాలయం ముఖ్య ఉద్దేశమని వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పేర్కొన్నారు. నంబూరులోని సంస్థలో నిర్వహించిన 2026–27 విద్యాసంవత్సరపు మొదటి ఏడాది విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈఏపీసెట్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచి, విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని, మాపై వారికున్న నమ్మకం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. విశ్వవిద్యాలయంలోని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం ద్వారా విద్యార్థులు ఉపాధి కల్పనకు అవసరమైన మెరుగైన నైపుణ్యాలను సంపాదించుకోవచ్చన్నారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, సీఎఫ్‌ఏఓ సూర్యదేవర బదరీప్రసాద్, రిజిస్ట్రార్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, డీన్ ఫ్రేష్‌మన్ ఎంవీ రఘురామ్, డీన్ ఏఎస్‌బీ సిహెచ్.ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.


