తాడికొండ: పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పొన్నెకల్లులో గోపి కుటుంబాన్ని సీపీఐ బృందం పరామర్శించింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుని భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పార్టీ తరఫున కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావు, ముప్పాళ్ళ శివశంకరరావు, రేపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. మంగళగిరి పట్టణానికి చెందిన దుర్గ సోమవారం సాయంత్రం తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు చేసేందుకు గౌతమ బుద్ధ రోడ్డులోని ఉషోదయ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఉర్వశి థియేటర్ సమీపంలోకి రాగానే బైక్‌పై ముగ్గురు వ్యక్తులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని లాకెట్‌తో కూడిన సుమారు 4 సవర్ల బంగారు గొలుసును లాక్కొని వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో దుర్గ కిందపడి గాయపడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం బాధితురాలు తన కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుమారుడితో కలసి ఆమె మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


