టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి ఆర్టీసీ బస్సులో ఆగిన ప్రయాణికుడి గుండె

పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్‌ 5వ లైన్‌లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్‌ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్‌ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్‌ సెంటర్‌ మెయిన్‌ రోడ్‌ వైపు నుంచి బస్టాండ్‌ వైపు వెళుతున్న టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు.

చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్‌ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్‌కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్‌ నిక్కర్‌ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్‌ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్‌ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్‌ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్‌ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

మృతుడు కర్నూలు వాసి

మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్‌టౌన్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్‌ (38) కర్నూలులోని ప్రకాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement