పాత కక్షల కారణంగా దారుణం ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సత్తెనపల్లి: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీ భీమవరం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన మల్లవరపు బ్రహ్మయ్య (46) చిత్తు కాగితాలు ఏరుకుంటూ రంగాకాలనీలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మయ్యకు స్థానికుడైన చెన్నంశెట్టి శ్రీనుతోపాటు చెల్లెలు వరుసైన క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పద్మతో పరిచయాలు ఉన్నాయి. వారిరువురు కూడా క్రోసూరు ఏరియాలో చిత్త్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పద్మతో చెన్నంశెట్టి శ్రీను సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం తాగిన బ్రహ్మయ్య, శ్రీను ఈ విషయంలో గొడవ పడ్డారు. శ్రీను తలపై బ్రహ్మయ్య కర్రతో దాడి చేయగా గాయమైంది. తన సహజీవనానికి అడ్డు తగలడాన్ని మనసులో పెట్టుకున్న చెన్నంశెట్టి శ్రీను, పద్మలు కలిసి బ్రహ్మయ్యపై దాడి చేశారు. గుండెలపై తీవ్రంగా కొట్టి భీమవరం రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీను, పద్మ సహజీవనం చేస్తుండడంతో బ్రహ్మయ్య గతంలో కూడా పలుమార్లు మందలించాడు. దానిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మయ్యపై దాడి చేసి హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలోనే నల్లబోతు బ్రహ్మయ్యను వారిద్దరు హతమార్చినట్లు వెల్లడించారు. నిందితులు చెన్నంశెట్టి శ్రీను, పద్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు.


