బెడ్ సైడ్ బోధనకు మంగళం
గుంటూరు మెడికల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు పెద్దాసుపత్రి(జీజీహెచ్)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో నిపుణులైన అధ్యాపకులు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎందరో విద్యార్థులు ఇక్కడ చేరుతుంటారు. అయితే, కొంత మంది వైద్య విభాగాధిపతులు, ప్రొఫెసర్లు బాధ్యతలు మరుస్తున్నారు. ఎంబీబీస్, పీజీ విద్యార్థులకు బెడ్ సైడ్ బోధన తప్పనిసరి. అయితే, సీనియర్ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ఓపీలోనే వైద్య విద్యార్థులకు బోధన చేస్తున్నారు. ఇందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఓపీ వైద్యసేవలకు పురమాయిస్తున్నారు. వార్డుల్లో రోగి పడక వద్దకు వైద్య విద్యార్థులను తీసుకెళ్లకుండా బోధన చేయడంతో పాఠాలు అంతంత మాత్రంగానే వంట బడుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండి అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ) రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, దీన్ని ఎవరూ పాటించడం లేదు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలు అందించి, గంట సేపు భోజన విరామం తీసుకున్న తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు వార్డుల్లో బెడ్ సైడ్ టీచింగ్ చేస్తూ రోగులను చూడాల్సి ఉంటుంది. కాని కొంత మంది సీనియర్ వైద్యులు ఓపీలోనే జూనియర్ వైద్యులకు పాఠాలు చెబుతూ వేచి ఉండేలా చేస్తున్నారు. మరికొంత మంది విభాగాధిపతులు ఓపీలకు రాకుండా వార్డుల్లో ఉంటూ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విభాగాధిపతులు కూడా ఓపీలకు హాజరై రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. కొంత మంది సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు హాజరు కాకపోవడంతో జూనియర్లు తమకు తోచిన వైద్యంతో నెట్టుకొస్తున్నారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సలు, అందక రోగులు పలుమార్లు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది.
అడిషనల్ డీఎంఈ హోదాలో పని చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వి.సుందరాచారి, సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణలు వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేకూర్చే బెడ్‌సైడ్ టీచింగ్ గురించి పట్టించుకోవడం లేదు. రోగులకు ఓపీ వేళల్లో సకాలంలో, సక్రమంగా వైద్యసేవలు అందకపోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● రోగుల పడకల వద్ద వైద్య విద్యార్థులకు బోధన చేయటం లేదు
● ఉదయం ఓపీ వేళల్లోనే అంతా
మమ అనిపించేస్తున్నారు
● మధ్యాహ్నం నుంచి ఇళ్లకు, సొంత
క్లినిక్‌లకు సీనియర్ వైద్యుల పరుగులు
● పట్టించుకోని కాలేజ్ ప్రిన్సిపాల్,
జీజీహెచ్ సూపరింటెండెంట్
బెడ్‌సైడ్ టీచింగ్ తప్పనిసరి
పర్యవేక్షణ నిల్