మధురాతి మధురం
ప్రత్యేక ఆకర్షణగా మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ
ఆనాటి స్నేహం..
● గుంటూరు వైద్య కళాశాల 1959–65 బ్యాచ్ వైద్య విద్యార్థుల కలయిక
●66 ఏళ్ల అనంతరం తొలిసారిగా వైద్యుల రీ యూనియన్
గుంటూరు మెడికల్: నూనూగు మీసాల నూత్న యవ్వనంలో వైద్య కళాశాలలోకి అడుగుపెట్టారు. చదువు పూర్తిచేశారు. వైద్యవృత్తుల్లో స్థిరపడిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. వైద్యవిద్య పూర్తిచేసుకుని 66 ఏళ్లు దాటాయి. ఈ సందర్భంగా వారికి ఓ లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పటివరకు తమ పాత స్నేహితులను ఒక్కసారైనా కలవలేదనే బాధ వారందిరిలో మెదిలింది. వెంటనే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని సీనియర్ మోస్ట్ వైద్యులంతా నిశ్చయించుకున్నారు. వైద్య వృత్తిలో దేశ విదేశాల్లో ఉండి, కుటుంబ బాధ్యతలు, వయస్సు రీత్యా వచ్చే సమస్యలు అన్ని అధిగమించి ఎట్టకేలకు గురువారం గుంటూరులో రీ యూనియన్ పేరుతో గురువారం వైద్యులంతా కలుసుకున్నారు. ఆరు దశాబ్దాల తర్వాత కలుసుకున్న వైద్యులంతా ఒక్కసారిగా ఆనంద సాగారాల్లో ముగినితేలారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనంద డోలికల్లో విహరించారు. ఆ నాటి ఆ స్నేహం ఆనందగీతం... ఆ జ్ఙాపకాలన్ని మధురాతి మధురం... అంటూ పాటలు పాడుకున్నారు. గోడలు దూకిన రోజులు... మోకాలికి తగిలిన దెబ్బలు అంటూ తమ యవ్వనపు చిలిపి అల్లరి చేష్టలను చెప్పుకొని సంతోషపడ్డారు. వైద్య కళాశాలలో చేరిన రోజుల్లో ఏ విధంగా ఒకరినొకరు నిక్‌నేమ్స్‌తో పిలుచుకున్నారో ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకున్నారు. వయస్సు 80 దాటినా వారు 20 ఏళ్ల యువతీ, యువకుల మాదిరిగానే ఆట పాటలతో అలరించి అందరిని ఆశ్చర్య పరిచారు. కాలగమనంలో మృతిచెందిన తమ మిత్రులను స్మరించుకుని, నివాళులు అర్పించారు. మరోసారి ఇలా కలుసుకోవాలని మదిలో నిశ్చయించుకుని మదినిండా తియ్యటి జ్ఙాపకాలతో ఒకరిని విడిచి ఒకరు వీడిలేక వీడి వెళ్లారు.
అరుదైన రికార్డు సృష్టించిన వెద్యులు....
గుంటూరు వైద్య కళాశాలలో 1959–65 ఎంబీబీఎస్ చదివిన వైద్యులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తాము వైద్య విద్య అభ్యసించి 66 ఏళ్లు అయినప్పటికీ ఒక్కసారి కూడా రీ యూనియన్ చేసుకోకుండా వైద్య కళాశాలలో ఎవ్వరూ ఊహించని విధంగా గురువారం రీ యూనియన్ పేరుతో గుంటూరులో కలుసుకున్నారు. ఈ బ్యాచ్‌లో 131 మంది ఎంబీబీఎస్ చదవారు. వీరిలో సగం మంది మహిళలే ఉన్నారు. వీరిలో 40 మంది మరణించారు. ఒక్కొక్కరి వయస్సు 80 నుంచి 86 ఏళ్ల మధ్య ఉంటుంది. మొత్తం 26 మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అమెరికా, యూకే, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు వచ్చారు. తొలుత బృందావన్‌గార్డెన్స్ లోని క్యాపిటల్ హోటల్‌లో సమావేశమై జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. డాక్టర్ టీఎస్‌ఎన్ మూర్తి తన 84వ పుట్టినరోజు వేడుకలు బ్యాచ్‌మేట్స్ సమక్షంలో చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు.
ఎంబీబీఎస్ చదవి వైద్య వృత్తిలో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించి చిలుకలూరిపేటలో 1989లో ఎమ్మె ల్యేగా ఎన్నికై న కందిమళ్ల జయమ్మ రీ యూనియన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ఉన్నతికి కారణమైన గుంటూరు జీజీహెచ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు ఎన్.వి.రమణరావు, పి.ఎస్.జ్యోత్న్స, టి.కృష్ణమూర్తి, రంగారావు, మహేష్, అచ్యుతరావు, లలిత కుమారి, తదితరులు తమ అనుభవాలు పంచుకున్నారు.


