
నెత్తురోడిన జాతీయ రహదారి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి ఆగివున్న లారీని స్కూటీతో ఢీకొన్న మైనర్లు స్నేహితుడి పుట్టినరోజు ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘటన
మంగళగిరి టౌన్: పండుగకు రెండు రోజుల ముందు ఇద్దరు మైనర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా గడిపిన వారు విగత జీవులుగా ఇంటికి రావడం ఆయా కుటుంబాల్లో పెనుశోకం మిగిల్చింది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తాడాల వెంకన్నబాబు కొలనుకొండలో ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. వెంకన్నబాబు కుమారుడు సాత్విక్ (15), అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తోట ప్రసాద్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు తన స్నేహితుడు వడ్డే శ్రీనరేన్ (15)తో కలసి బైపాస్‌రోడ్‌లో వున్న అనంత ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. జన్మదిన వేడుకల్లో సందడిగా గడిపి ఫంక్షన్ అయిన వెంటనే సాత్విక్, శ్రీనరేన్‌లు స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఆదివారం రాత్రి కొలనుకొండ జయభేరి అపార్ట్‌మెంట్ సమీపంలోకి వచ్చే సరికి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై లారీ ఆగివున్న విషయాన్ని గమనించని బాలురు స్కూటీతో లారీని వెనుక వైపు బలంగా ఢీకొన్నారు. దీంతో నరేన్, సాత్విక్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్ట్‌మార్టం అనంతరం మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాత్విక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు పేర్కొన్నారు. సాత్విక్, శ్రీ నరేన్‌లు 10వ తరగతి చదువుతున్నారు.

నెత్తురోడిన జాతీయ రహదారి

నెత్తురోడిన జాతీయ రహదారి