
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆదివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. తొలుత బీఆర్ స్టేడియం నుంచి సీపీఐ జిల్లా కార్యాలయం వరకు ప్రజాప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లా డుతూ సంవత్సర కాలంలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్–6 హామీ లన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు.
● నూతన బస్సులు కొనుగోలు చేయకుండా, తగిన సిబ్బంది నియామకం జరగకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తాము చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాజధానికి మరో 40 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. లూలూ కంపెనీకి రూ.400 కోట్ల విలువైన భూములను 99 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరికం పోతుందని చంద్రబాబు చెబుతున్నారని, ఇటువంటి విధానాలతో పాలన చేస్తే 1000 ఏళ్లకు కూడా పేదరికం పోదని స్పష్టం చేశారు. ఒంగోలులో ఈనెల 23, 24, 25 తేదీలలో జరగనున్న రాష్ట్ర మహాసభలకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర వేడుకలలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని విస్మరించి అసలు పోరాటంలో భాగస్వాములు కాని ఆర్‌ఎస్‌ఎస్ వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలకు ఆయుధంగా ఇచ్చిన ఓటు హక్కును రద్దు చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్, దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీతో లాలూచీ పడిందని, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే గాని ఓటర్ లిస్టు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారని విమర్శించారు. మోదీ పాలనలో అంబానీ, అదాని వంటి కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులుగా ఎదిగారని దుయ్యబట్టారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి అరుణ్‌కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
పార్టీ జిల్లా మహాసభలు ప్రారంభం