
టీడీపీలో ‘చైర్మన్’ చిచ్చు
అక్రమాలన్నీ బయటపెడతాం..
● సొసైటీ చైర్మన్ పదవిని విక్రయించిన
షాడో ఎమ్మెల్యేపై తమ్ముళ్ల వీరంగం
● గుంటూరు ఎంపీ కార్యాలయంలో
అసంతృప్త నేతలతో రాజీ చర్చలు
● ప్రమాణ స్వీకారం చేయిస్తే తామేంటో
చూపిస్తామంటూ తమ్ముళ్ల సవాల్
● గ్రామాల్లో గ్రూపులను ఎగదోస్తూ
పోస్టులను ‘షాడో ఎమ్మెల్యే’
విక్రయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం
● నేటి ప్రమాణ స్వీకారంపై
నెలకొన్న సందిగ్ధత
తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండల బండారుపల్లి కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో అంతా తానే అయి నడుపుతున్న షాడో నేత ఒకరు ఇలాంటి నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణం.
బండారుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి పానయ్యని సొసైటీ చైర్మన్‌గా నియమించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామంలో ఉన్న టీడీపీలోని మూడు గ్రూపులు ఏకమయ్యాయి. సోమవారం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా... అదే జరిగితే తామేంటో చూపిస్తామంటూ వారందరూ వీరంగం సృష్టించారు. ఈ వ్యవహారంపై ఆదివారం గుంటూరు ఎంపీ పెమ్మసాని కార్యాలయంలో పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ పంచాయితీలో గ్రామానికి చెందిన వంద మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ పదవి కేటాయింపుపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు.
విభజించి మరీ పదవుల విక్రయం
షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేత గ్రామాల్లో గ్రూపులుగా విభజించి పార్టీని నాశనం చేస్తున్నాడని, ఇప్పటికే గ్రామంలో మూడు గ్రూపులు ఉన్నాయని స్థానిక నేతలు వాపోయారు. 2023 వరకు అసలు పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తికి ఎలా సొసైటీ పదవి అప్పగిస్తారంటూ నిప్పులు చెరిగారు. ఎంపీ సోదరుడి సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో కనీసం 3 నెలలైనా అతనికి పదవి ఇచ్చి తదనంతరం రాజీనామా చేయిద్దామంటూ ప్రతిపాదించినా.. 3 నిమిషాలు కూడా సీటులో కూర్చుంటే ఒప్పుకోబోమని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటి వరకు 3 గ్రూపులుగా ఉన్న టీడీపీ వర్గం అంతా ఏకమై ఎదురుతిరగడంతో ఏం చేయాలో పాలుపోక ఎమ్మెల్యే కార్యాలయం, షాడో ఎమ్మెల్యే తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తమవైపు నుంచి నలుగురు వ్యక్తులను రాజీ చర్చలకు పంపించినా వారు కూడా సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. తమ్ముళ్ల ఆగ్రహానికి వారు కూడా ఏం చేయాలో పాలుపోక సైలెంట్‌గా వెళ్లిపోవాల్సి వచ్చింది.
షాడో ఎమ్మెల్యే లీలలపై పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తుండటం విశేషం. తమ మాటను ధిక్కరిస్తే ఇప్పటి వరకు ఆయన చేసిన అడ్డగోలు దోపిడీని బయటపెట్టి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నోరు విప్పుతామని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కార్యాలయాలు, అక్రమ మైనింగ్, బదిలీలు, పదవుల అమ్మకం వంటి పలు వ్యహారాలపై ఇప్పటికే అతగాడు చేసిన చిట్టాను సిద్ధం చేసిన సదరు నేతలు.. ఆయన లీలలపై త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి దందాపై అసలు వ్యక్తి నోరుమెదపక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో తమకీ అంతుబట్టడం లేదంటూ పలువురు పేర్కొనడం చూస్తే రాజధాని నియోజకవర్గంలో షాడో దందాపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.