మాతృ మరణాలపై సమీక్ష
లక్ష్మీపురం: జిల్లాలో మాతృమరణాలు సంభవించకుండా క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళిక ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో గత సంవత్సరం చివరి త్రైమాసికం, ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగిన ఐదు మాతృ మరణాలపై సంబంధిత వైద్య అధికారులు, వైద్యనిపుణులు, బాధితుల బంధువులతో ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, డీఐఓ శ్రావణ బాబు, డీసీహెచ్‌ఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లను రెగ్యులర్‌గా
తనిఖీ చేయాలి
లక్ష్మీపురం: ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయ్యే కొత్త స్కానింగ్ సెంటర్స్ మరియు రెన్యువల్ స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి తనిఖీ చేయాలని, చట్టాన్ని ఉల్లఘించిన కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధ్యక్షతన గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై డిస్ట్రిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. స్కానింగ్ కోసం కేంద్రాలకు వచ్చే గర్భిణుల నుంచి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ డా. విజయలక్ష్మి, ప్రోగ్రామ్ నోడల్ అధికారి డా. శ్రావణ్ బాబు మాట్లాడుతూ తెనాలిలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ , మిగిలిన చోట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు స్కానింగ్ ఆఫీసర్లుగా తనిఖీ చేస్తారని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో మొత్తం 298 గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షా కేంద్రాలు వున్నాయని, వాటిలో రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం ఐదు, మాడిఫికేషన్ కోసం 25 , క్యాన్సిలేషన్ కొరకు ఆరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే కొత్తగా 11 స్కానింగ్ సెంటర్లు రిజిష్ట్రేషన్ చేసుకొన్నారని వాటిని కమిటీ సభ్యులు, ప్రోగ్రాం ఆఫీసర్లు తనిఖీ చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కమిటీ కొత్త స్కానింగ్ సెంటర్లు, రెన్యువల్, మాడిఫికేషన్, క్యాన్సిలేషన్‌ను ఆమోదం తెలపడం జరిగింది. కమిటీ సభ్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి , డాక్టర్ అనిత , డీఎస్పీ శ్రీనివాసులు, ఎన్జీఓ సీడ్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.రోషన్ కుమార్ డా. రవీంధ్ర నాయక్ , డీఏడబ్ల్యూ ఎన్.నిర్మల మేరీ , డెమో జయప్రసాద్ , లీగల్ కన్సల్టెంట్ బి.వాణి , హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు


