కాంట్రాక్టర్ అవతారమెత్తిన దళారి
తెనాలిలో లబ్ధిదారుల నుంచి రూ.1.70 కోట్లకు పైగా దళారి వసూలు
ఇళ్లు నిర్మిస్తానని డబ్బులు వసూలు చేసి పరారీ
మోసపోయామని బాధితుల ఆవేదన ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు వినతి
తెనాలి అర్బన్: గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహనరెడ్డి హయాంలో పేదలకు గృహ యోగం కల్పించారు. జగనన్న కాలనీల పేరుతో ఊళ్లకు ఊళ్లు వెలిశాయి. పేదల సొంతింటి కల నెరవేరింది. తలదాచుకోవడానికి నిలువనీడ దొరుకుతుందని ఆశ పడ్డారు. వారి ఆశను ఓ దళారి సొమ్ము చేసుకున్నాడు. ఇళ్లు కట్టించి పెడతానని ఆశ చూపాడు. సగం సగం కట్టి మొహం చాటేశాడు. తెనాలి పట్టణం, మండల పరిధిలోని 23,718 మందికి పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, నేలపాడు, గోలిడొంక, బుర్రిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వీటిలో తెనాలి పట్టణానికి చెందిన 9907 మంది, మండల పరిధిలో 1680 మంది ఉన్నారు.
పేదలు ఇబ్బంది పడకూడదని ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివాస స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావించింది. దీనిలో భాగంగా తెనాలి పరిధిలో మొదటి విడత కింద 11,587 మందిని ఎంపిక చేసింది.వారికి గత రూ.1.80 లక్షల నగదుతో పాటు 340 కేజీల ఇనుము, 90బస్తాల సిమెంట్, ఇసుకను సరఫరా చేసింది.
పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని తెనాలి పట్టణం 24వ వార్డుకు చెందిన ఎస్‌జీ బిల్డింగ్ వర్కు అధినేత ఎం. పున్నారావు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ప్రభుత్వం ఇచ్చే నగదులో ఇళ్లు నిర్మిస్తానని చెప్పి బుర్రిపాలెం లేవుట్‌లో 180 మంది నుంచి రూ.50వేలను అడ్వాన్స్‌గా వసూలు చేశాడు. వాయిదాల రూపంలో ప్రభుత్వం ఇచ్చే నగదును ఇవ్వడంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు.
100 మంది లబ్ధిదారుల నుంచి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1.97కోట్ల నిధులతో పాటు రూ.50లక్షల వరకు సొంత నగదు వసూలు చేశాడు. వీటిలో రూ.80లక్షల విలువ చేసే పనులు మాత్రమే చేసినట్లు ఆ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇది కాకుండా మరో కాంట్రాక్టర్ వద్ద ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి రూ.లక్షలలో అడ్వాన్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతంలో ఉన్న అతడిని పట్టుకోవడంతో తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు.
రూ.2.50 లక్షలకు అగ్రిమెంట్
బుర్రిపాలెంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించి ఇస్తానని రూ.2.50 లక్షలకు పున్నారావు అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీనిలో భాగంగా రూ.1.50లక్షలు తీసుకున్నాడు. ఇవి కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన మెటీరియల్ కూడా తీసుకున్నాడు. మూడు సంవత్సరాలు దాటినా నిర్మాణం పూర్తి చేయలేదు.
– రామిశెట్టి దుర్గాంబ, నందులపేట, తెనాలి
అధికారులు చర్యలు తీసుకోవాలి
బుర్రిపాలెం లే అవుట్‌లో ఇల్లు నిర్మించి ఇస్తానని పున్నారావు నా దగ్గర రూ.1.30 లక్షలు తీసు కున్నాడు. పునాదులు వరకు వేశాడు. మిగిలిన పని చేయడం లేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. అధికారులు స్పందించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– రామిశెట్టి బాలకృష్ణ, తెనాలి
పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
పున్నారావు నగదు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. లబ్ధిదారుల ఫిర్యాదును పోలీసు అధికారులకు పంపి కేసు నమోదు చేయాలని కోరాం. అతడ్ని పిలిపించి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– భాస్కర్, ఈఈ, గృహనిర్మాణశాఖ, తెనాలి
కాంట్రాక్టర్ అవతారమెత్తిన దళారి
కాంట్రాక్టర్ అవతారమెత్తిన దళారి


