కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Published Wed, May 22 2024 9:05 AM

కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చివరి దశలోకి వచ్చామని, కౌంటింగ్‌ ప్రక్రియను విజయవంతంగా ముగించే వరకూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల శిక్షణ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే నెల 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని, స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలు తీసుకు వచ్చిన దగ్గర్నుంచి కౌంటింగ్‌ పూర్తవగానే మళ్లీ వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత సర్వీస్‌ ఓటర్లు, ఆ తర్వాత ఈవీఎంల ఓటింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సూచనలు ఆర్‌ఓలు, ఏఆర్వోలు తప్పక పాటించాలన్నారు. నిబంధనలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయడం సంతోషమన్నారు.

ఐడీ కార్డులు తప్పనిసరి

కౌంటింగ్‌ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసు బృందాలకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. నియోజకవర్గాల వారీగా సిబ్బంది చేరుకునేందుకు సైన్‌బోర్డులు ఉండాలన్నారు. కౌంటింగ్‌ హాలు వద్ద రిసెప్షన్‌, హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి లేదని పేర్కొన్నారు. లోపలికి వెళ్ళే ముందే మొబైల్స్‌ సంబంధిత కౌంటర్ల వద్ద డిపాజిట్‌ చేయాలన్నారు.

రిజర్వ్‌ టీములకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో కౌంటింగ్‌ సిబ్బందికి తొలి దశ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల 3న ఏఎన్‌యూలో రెండో దశ శిక్షణ, అనంతరం సిబ్బందికి కౌంటింగ్‌ కేంద్రాలు కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సంతకం చేసిన తర్వాత మాత్రమే సిబ్బంది ఫలితాలను వెల్లడించాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాధ్‌, డీఆర్వో పెద్ది రోజా, స్ఫెసల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎ.అరవిందరావు, లక్ష్మీకుమారి, గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement