
పేరంటాలమ్మ తిరునాళ్లు
తెనాలి: అయితానగర్‌లో రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీవెంకయ్య–గౌరమ్మ దేవస్థానంలో పేరంటాలమ్మ తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్ల సందర్భంగా ఆలయం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈనెల 18 నుంచి ప్రారంభమై 22వ తేదీ వరకూ జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ వెంకయ్య–గౌరమ్మలకు విశేష పూజలు చేస్తున్నారు. రెండోరోజైన ఆదివారం రాత్రి గుమ్మడి సిడి మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు తరలి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈత పండ్లు, తాటికాయలు, వేపాకులతో ప్రత్యేకంగా సిడిమానును అలంకరించారు. కనకతప్పెట్లు, డప్పులతో ఆలయ ప్రదక్షిణలు చేశారు. మహిళలు గుమ్మడికాయలు తెచ్చి సమర్పించారు. అనంతరం గుమ్మడి సిడి కార్యక్రమంలో భాగంగా సిడిమాను ఊరేగింపు నిర్వహించారు. పేరంటాలమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమై పట్టణ వీధుల్లో ఊరేగింపు సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర కార్యక్రమాలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి పొంగలి నైవేద్యం సమర్పణ, గండ దీపాలు, అడుగులు–మడుగులు, పసుపుబండ్లు, కరెంటు ప్రభల ఊరేగింపు, మేకసిడి, గంప సిడులతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నిర్వహణను స్ధానిక పెద్దలు పర్యవేక్షిస్తున్నారు.

పేరంటాలమ్మ తిరునాళ్లు