● దుర్గాదేవిగా కటాక్షించిన అమ్మ ● ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం ● 1.20 లక్షల మంది సందర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదేవి శరన్నవరాత్రుల్లో ఆదివారం దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. మహర్నవమి, ఆదివారం కావడంతో రికార్డు స్థాయిలో 1.20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.500 టికెట్ క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా సమయం పట్టింది. సీపీ టీకే రాణా ఆలయ ప్రాంగణానికి చేరుకుని వీఐపీల పేరిట వచ్చే భక్తులను నియంత్రించారు. దీంతో క్యూలైన్‌లో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు రెండు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహిషాసురమర్దనిదేవిగా, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని సోమవారం ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి జరుగుతుంది.
పెరిగిన భవానీల రద్దీ
ఆదివారం నుంచి భవానీల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం క్యూలైన్‌లో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భవానీలు మహా మండపం వద్ద ఇరుముడులను సమర్పించారు. సోమవారం నుంచి భవానీల రద్దీ మరింత పెరుగుతుందని ఆలయ అధికారులు, పోలీసులు అంచనా వేస్తున్నారు.
దుర్గమ్మకు విజయకీలాద్రి నుంచి సారె
చినజీయర్ ఆశ్రమం విజయకీలాద్రి నుంచి దుర్గమ్మకు సారెను అందజేశారు. త్రిదండి రామానుజజీయర్ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేయడానికి ఇంద్రకీలాద్రికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని సారెను ఆలయ అర్చకులకు అందజేశారు. పలువురు అధికారులు, న్యాయమూర్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎపీఎస్‌ఫీఎఫ్ ఐజీ టి.వెంకటరామిరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అమ్మవారిని దర్శించుకున్నారు.
నేడు తెప్పోత్సవం
దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లు సోమవారం కృష్ణానదిలో విహరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానదిలో హంస వాహనంపై ఆది దంపతులు మూడుసార్లు విహరిస్తారు. భక్తులకు కనువిందు చేస్తారు.
నేత్రపర్వం.. నగరోత్సవం
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల నగరోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఆది దంపతుల నగరోత్సవ సేవ ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. నగరోత్సవ సేవలో పలువురు భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కనకదుర్గ నగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి మీదుగా నగరోత్సవం అమ్మ ఆలయానికి చేరుకుంది. అక్కడ ఆది దంపతులకు ప్రత్యేక పూజలు చేశారు.