YSR Pension Kanuka: ఆ పెన్షనే వారికి ఆధారం!

YSR Pension Kanuka Scheme Livelihood for Many Poor, Elderly, Widows - Sakshi

సందర్భం

జగనన్న ప్రారంభించిన సంక్షేమ పథకాలలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం ఎంతో మంది పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగు లకు జీవనాధారం అయ్యింది. అయితే ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవడం కోసం పెన్షన్‌ దారులు చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు వస్తున్నాయి. 

బడుగు, బలహీన వర్గాలకు పెన్షన్‌ అందించ డంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది. ఈ పెన్షన్లలో కేంద్రం ఇచ్చే నగదు వాటా అతి స్వల్పం మాత్రమే. ఏపీ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ. 200 మాత్రమే. మిగిలిన రూ. 2,300 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 

అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 200 మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,800 ఇస్తున్నది. ఎన్నికల వాగ్దానం ప్రకారం, ఏ రాష్ట్రాలలో లేని విధంగా చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, హెచ్‌ఐవీ కలిగి ఉన్నవారు అర్హతను బట్టి నెలకు రూ. 2,500 పెన్షన్‌ తీసుకుంటున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులకు నెలకు రూ. 3,000 పెన్షన్‌గా అందజేస్తోంది. గ్రామ సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థ ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల కంటే చాలా వేగంగా అమలు చేయడానికి సహాయపడుతోంది.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం అమలు గురించి తెలుసుకోవడానికి ఏడు పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ల (పీటీజీ) గ్రామాలను సందర్శించి అక్కడున్న పెన్షన్‌ లబ్ధిదారులతో మాట్లాడడం జరి గింది. పీటీజీలు ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో, కొండవాలు ప్రాంతాల్లో, ఊరికి దూరంగా అడవులలో నివసిస్తుంటారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్న జగనన్న ఇంటివద్దకు పెన్షన్‌ పథకం వారికి వరంగా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ఈ పెన్షన్‌ నగదును తీసుకోవడానికి మేజర్‌ గ్రామ పంచాయితీ కార్యా లయం లేదా పోస్టాఫీసుకు వెళ్ళవలసి వచ్చేది. 

ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామ వాలంటీర్‌ ప్రతినెలా ఒకటవ తేదీన క్రమం తప్పకుండా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. ఇంకా అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హులైన వారి పేరు వారం రోజుల లోపు సంక్షేమ పథకంలో చేర్చబడుతుంది. ప్రస్తుతం నేను సర్వే చేసిన గ్రామాల్లో అర్హత ఉన్న వారందరికీ పెన్షన్‌ వస్తోంది. కొంతమంది దివ్యాంగులు సదరం నివేదికల గురించి వేచి చూస్తున్నారు. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!)

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం లబ్ధిదారుల్లో ఆర్థిక భద్రతను పెంచింది. పెన్షన్‌ లబ్ధిదారులు ఎవరిపైనా ఆధారపడకుండా వారికి వచ్చే మొత్తాన్ని ఆహారం కోసం, మందుల కోసం, బట్టల కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం వెచ్చిస్తున్నారు. కొందరు వారికొచ్చిన పెన్షన్‌లో కొంత భాగాన్ని వారి పిల్లలకు, మనమళ్లకు ఇస్తున్నారు. కొంతమంది వృద్ధులపై... వారి పిల్లలు పెన్షన్‌ నగదు కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఆడవారిపై అధికంగా ఉంది. 

మారుమూల అటవీ ప్రాంతాల్లో సిగ్నల్స్, నెట్‌ వర్క్‌ సమస్యలు ఉండడం ద్వారా కొంతమందికి పెన్షన్‌ పంపిణిలో జాప్యం అవుతోంది. బయోమెట్రిక్‌ విధానాన్ని కొత్త సాంకేతికతతో పునర్వ్యవస్థీకరించడం ద్వారా, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మొత్తం మ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలతో పీటీజీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. (క్లిక్: మేనేజ్‌మెంట్‌ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?)

- డా. ముట్లూరి అబ్రహం
ఆంధ్రా యూనివర్సిటీ సోషల్‌ వర్క్‌ శాఖలో గెస్ట్‌ ఫ్యాకల్టీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top