కార్మికలోకం రుణం తీర్చుకున్నారు!

YSR Congress Party Trade Union Formation Day: Poonur Gautam Reddy - Sakshi

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కళ్లారా చూడాలని రాష్ట్రంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్మికలోకం పరితపించింది. ఆయన పాదయాత్రలో అడుగడుగునా కార్మికుల అడుగు జాడలు ప్రస్ఫుటంగా కనిపిం చాయి. ప్రతిచోటా కార్మికులు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలతో ఆయనను కలిశారు. వారి వారి సమస్యలను ఓపికతో విన్న జగన్‌మోహన్‌ రెడ్డి అక్కడే వారికి హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రావడానికి... కార్మికవర్గం పడిన శ్రమ, తాపత్రయం కూడా కారణాలే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 11 ఏళ్లు. ఈ సందర్భంగా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును తలుచుకోవడం అవసరం.

తాడిత, పీడిత ప్రజలు, కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగానే 2019 మే 30న అందరి ఆశీస్సులతో జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 రకాల కార్మిక యూనియన్లకు చెందిన ప్రతి ఒక్కరూ జగన్‌ విజయంలో ప్రధాన భూమిక పోషించినవారే.  అందుకే అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుండే పాదయాత్రలో తనకు వచ్చిన వినతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు జగన్‌. ముఖ్య మంత్రిగా తొలి సంతకం అవ్వ–తాతలకు పింఛన్‌ పెంపు ఫైల్‌పై చేశారు.  తర్వాత ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుండి ఏకంగా రూ. 10 వేలకు వేతనాన్ని పెంచారు.

ఒకేసారి వేతనాన్ని 300 శాతం పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. అదేక్రమంలో డ్వాక్రా సంఘాల్లో పనిచేసే యానిమేటర్లు, బుక్‌ కీపర్లకు రూ. 10 వేల వంతున గౌరవ వేతనం అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అర్హత, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అందుకే పారిశుద్ధ్య కార్మికులకు రూ. 18 వేల వంతున వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇక అంగన్‌ వాడీ కార్యకర్తలకు రూ. 11,500, ఆయాలకు రూ. 7 వేల వంతున వేతనాల పెంపు చేశారు. గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు రూ. 400 నుండి రూ. 4 వేలకు వేతనాన్ని పెంచారు. వారితోపాటే హోం గార్డులకు కూడా వేతనాలు పెంచి బడుగు జీవుల జీవితాల్లో దీపావళి కాంతులు నింపారు.  

పథకాలన్నీ కార్మిక నేస్తాలే!
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వెఎస్సార్‌ లా నేస్తం, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్‌ భీమా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాలు నిరుపేదల ఇళ్లల్లో సంక్షేమ సంక్రాంతిని నింపాయి. నగదు బదిలీ ద్వారా 24 రకాల పథకాల పేరిట లబ్ధిదారులకు రూ. 84,402.68 కోట్లు ఇచ్చారు. అలాగే నగదు బదిలీతో సంబంధం లేకుండా మరో 5 రకాల పథకాల ద్వారా 1,52,69,364 మంది లబ్ధిదారులకు రూ. 15,714.58 కోట్ల మేర లాభం కలిగించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో రూ. 1,00,117.26 కోట్లమేర ప్రజలకు లబ్ధి చేకూరింది. ఇందులో అసంఘటిత, సంఘటిత రంగాల్లో ఉన్న కార్మిక వర్గమే ఎక్కువ ప్రయోజనం పొందిందని వేరే చెప్పనవసరం లేదు.   

గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల ముందుకే తీసుకెళ్లారు సీఎం జగన్‌. అప్పటివరకూ వివిధ రంగాల్లో చిన్నా చితకా వేతనాలకు కార్మికులుగా పనిచేస్తున్న యువతీ యువకులు ప్రభుత్వో ద్యోగులుగా, ప్రతినిధులుగా మారారు.

విద్య, వైద్యాలను దరిచేర్చి...
పేదలకు విద్య, వైద్యం అందకపోవడం వల్ల వారి అభివృద్ధి సాధ్యం కావటంలేదని గ్రహించి... ఆయా రంగాల్లో ‘నాడు–నేడు’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి కార్పొరేట్‌ తరహా సేవలను నిరుపేదల ముంగిటకు తీసుకొచ్చారు. ఇది ఆశించినదానికంటే మంచి ఫలితాల నిచ్చింది. అదేక్రమంలో ఆరోగ్య శ్రీ సేవల పరిధిని పెంచి నిరుపేదలైన కార్మికుల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అచ్చంగా కార్మికలోకాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక బీమా, కార్మికులకు గుర్తింపు కార్డుల అందజేత వంటి అనేకానేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంటిలో మహిళలు ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి వస్తుందని బలంగా నమ్మిన సీఎం జగన్‌ మహిళల పేరుతోనే సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కార్మిక మహిళలే ఎక్కువగా ఫలితం పొందుతున్నారు. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలకు భరోసా కల్పించారు. (క్లిక్‌: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?)

అమరావతిలోనూ...
మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మార్చిన చంద్రబాబు... ఆ మహానగరంలో నిర్మించ తలపెట్టిన నవ నగరాల్లో ఏ నగరంలో కూడా కార్మికులు ఉండకూదనీ, అలా ఉంటే సామాజిక సమతౌల్యం లోపి స్తుందనే పక్షపాత ధోరణిని ప్రదర్శించారు. కార్మిక వర్గాలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. పాదయాత్రలో ఉన్న జగన్‌కు నివేదించాయి. దానికి తీవ్రంగా స్పందించిన జగన్‌ అధికారంలోకి రాగానే ఆ అసమానతలను రూపు మాపి, అక్కడే కార్మిక వర్గానికి కూడా స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఆయన నిలబెట్టు కున్నారు.  (క్లిక్‌: బాబు బ్రాండ్‌ రాజకీయాలు)

ఇలా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి కార్మికులు చేసిన శ్రమ ఊరకే పోలేదు. ఆయన అధికారంలోకి రాగానే కార్మికుల రుణం తీర్చుకున్నారు.

- డాక్టర్‌ పూనూరు గౌతమ్‌ రెడ్డి 
ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్, రాష్ట్ర వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు
(నేడు వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top