Sakshi News home page

బాబు బ్రాండ్‌ రాజకీయాలు

Published Wed, Mar 23 2022 2:39 AM

Kommineni Srinivasa Rao Article On Chandrababu Naidu Liquor Politics - Sakshi

మనం మంచి చేయలేనప్పుడు, ఎదుటివారు చేస్తున్న మంచిని నిరాకరిస్తే? మనకు సమర్థత లేనప్పుడు, ఎదుటివారు అసమర్థులని విరుచుకుపడితే? ఇవీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు. నాటుసారా మరణాలంటూ ‘జంగారెడ్డిగూడెం యాగీ’ని సృష్టించింది... అసెంబ్లీలో ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్‌ సమాధానాలను అడ్డుకోవడం కోసమే అన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. తద్వారా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏర్పడే సానుకూలతను అడ్డే యత్నం అది. ఇందులో సహజంగానే టీడీపీ మీడియా భాగం అవుతుంది. గతంలో సారా నిషేధం అమలులోనూ, అనంతరం దాన్ని ఎత్తివేయడంలోనూ, తిరిగి ఇప్పుడూ టీడీపీ, దాని అనుకూల మీడియా ఆడుతున్నవి కపట నాటకాలే!

ఒక పత్రికలో నాటుసారా వల్ల జంగారెడ్డి గూడెం వద్ద పలువురు మరణించారని వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు వెంటనే జంగారెడ్డిగూడెం వెళ్లి పోయారు. ఆయన ఎటూ అసెంబ్లీకి రావడం లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించి రచ్చ చేయిస్తున్నారు. నిజంగానే నాటు సారా వల్ల ఎవరైనా మరణిస్తే విచారించవలసిందే. దానిని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం మాత్రం విచారకరం. సారా వల్ల అందరూ చనిపోలేదనీ, సహజ మరణాలనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తాను స్వయంగా బాధిత కుటుంబాలతోనూ, ప్రభుత్వ వైద్యులతోనూ మాట్లాడానని శాసనసభలో వివరించారు. అయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు శాంతించలేదు.

ప్రతి రోజూ ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్‌ సమాధానాలను రానివ్వకుండా చేయడం కోసమే ఇలా వ్యవహరించేవారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఉదాహరణకు ఒక రోజు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడంపై చర్చ జరగవలసి ఉంది. దానిపై ముఖ్య మంత్రి జగన్‌ సహజంగానే తన భావాలను పంచుకుంటారు.  తెలుగు దేశం నేతలు ఈ స్కీమ్‌కు కోర్టుల ద్వారా ఎలా అడ్డుపడిందీ వివరి స్తారు. దీనికి ఇష్టపడని టీడీపీ ఈ లొల్లిని సాకుగా వాడుకుంది. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్ర బాబు ఆరోపించారు. 

నిజంగానే ఇలాంటి మరణాలపై టీడీపీ నాయకత్వానికి సాను భూతి ఉందా అనుకుంటే అదేమీ కనిపించదు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు, ఆయన కుటుంబం పుణ్యస్నానం చేసే సన్నివేశాలను డాక్యుమెంటరీగా చిత్రీకరించడం కోసం సామాన్య భక్తులను అంద రినీ గేటు వద్దే నిలిపివేశారు. వేల సంఖ్యలో జనం గుమికూడటం, ఒక్కసారిగా గేటు తీయడంతో తొక్కిసలాట జరిగి ఇరవై తొమ్మిది మంది నిమిషాలలో మరణించారు.

కానీ ఆ కేసులో కనీసం ఒక్క కానిస్టేబుల్‌ కూడా సస్పెండ్‌ కాలేదు. చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోలేదు. పైగా ఆ ఘటనకు సంబంధించి ఏ విధంగా జవాబు ఇచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. కుంభమేళాలో చనిపోవడం లేదా? జగన్నాథ ఊరేగింపులో మరణించలేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందలేదా అని వ్యాఖ్యానించి పుష్కరాల తొక్కిసలాటను చిన్న సమస్యగా తేల్చేశారు. తన ప్రచార యావ కోసం తొక్కిసలాట జరిగిందన్న సంగతిని పక్కనపెట్టి రోడ్డు ప్రమాదాలతో పోల్చారు. 

కానీ ఈ మూడేళ్లలో ఎక్కడ ఏ ఘటనలో ఎవరు మరణించినా, తెలుగుదేశ వర్గం మీడియా దానిని వివాదం చేస్తోంది. వెంటనే చంద్ర బాబు లేదా ఆయన కుమారుడు అక్కడకు వెళతారు. తమ తండ్రి చనిపోయిన బాధ కన్నా కొంతమంది దీనిని రాజకీయం చేసి సారా వల్ల చనిపోయారని చెప్పడం మరింత బాధగా ఉందనీ, ఇది అవమానకరమనీ అతడి కుమారుడు, కుమార్తె వాపోయినా వీరికి పట్టదు. అసలు సారా అలవాటే లేని వ్యక్తికి కూడా దీనిని అంటగట్టి అవమానించడానికి ఈ రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదు. 
ఇలాంటి ఘటనలు జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు.

దీనికి ఏకంగా ముఖ్యమంత్రో, మంత్రో రాజీనామా చేయవలసి వస్తే, టీడీపీ హయాంలో జరిగిన వాటికి ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్ని సార్లు రాజీనామా చేసి ఉండాలి! తిరుపతి అడవులలో ఇరవై మంది ఎర్రచందనం కూలీలను ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఒక మహిళా అధికారిని జుట్టుపట్టి కిందపడేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద అక్రమ ఇసుక వ్యవహారంలో లారీతో ఢీకొట్టి సుమారు పదిమందిని దుండ గులు చంపినప్పుడు ఎవరు పదవుల నుంచి వైదొలగాలి? ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. 

ఇక్కడ ఒక విశేషాన్ని గుర్తు చేసుకోవాలి. సారా నిషేధం కావాలని నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ నేతృత్వంలో ఒక ఉద్యమం జరిగింది. అది ఇతర ప్రాంతాలకు కూడా పాకింది. ఒక ప్రధాన పత్రిక ఆ అంశాన్ని తన భుజాన ఎత్తుకుని ఒక పేజీ కేటాయించి వార్తలు ఇచ్చేది. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సారాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఆ పత్రిక శాంతించలేదు.

మొత్తం మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పేజీలకు పేజీలు వార్తలు ఇస్తూ రాష్ట్రం అంతటా అల్లకల్లోలం అవుతున్నట్లు భ్రమలు కల్పించేది. ఎన్‌.టి.రామారావు కూడా మద్య నిషేధాన్ని ఎన్నికల అంశంగా తీసుకుని ప్రచారం చేశారు. తాను సీఎం అవ్వగానే మద్య నిషేధం అమలు చేశారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తివేశారు. అప్పుడు ఆ పత్రికవారు నామ్‌ కే వాస్తే ఒక సంపాద కీయం రాసి వదిలేశారు. ఆ పత్రిక తన వ్యాపార, రాజకీయ కారణాల తోనే అలా వ్యవహరించిందని అప్పట్లో అంతా అనుకునేవారు.

ఎన్‌.టి.ఆర్‌. మద్య నిషేధం సమయంలో కొన్ని డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన లండన్‌ టూర్‌ వెళ్లారు. ఆ తరుణంలో చంద్రబాబు టీమ్‌ ఈ ఉత్తర్వులతో ఏపీ అంతా అలజడి ఏర్పడినట్లు ప్రచారం చేసింది. చివరికి లండన్‌లో ఉన్న ఎన్‌.టి.ఆర్‌.తో మాట్లాడి వాటిని కాన్సిల్‌ చేయించినట్లు చెప్పేవారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబే పలు డిస్టిలరీలకు, బ్రూవరీలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వంపై దాడి చేసే ప్రక్రియలో భాగంగా ఏపీలో ముఖ్యమైన బ్రాండ్‌ల మద్యం దొరకడం లేదనీ, జె బ్రాండ్‌ మద్యమే లభిస్తోందంటూ చంద్రబాబు ప్రచారం చేశారు.

తీరా చూస్తే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదట. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌... ఇలా రకరకాల పేర్లతో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ ఆయన టైమ్‌లోనే వచ్చినవట. నిజం వెలుగులోకి వచ్చే లోపు అబద్ధం లోకం చుట్టి వచ్చిందట. తెలుగుదేశం వారు తాము చేసిన తప్పులను ఎదుటివారిపై మోపి ప్రచారం చేయడంలో దిట్టలని ఈ ఉదంతం రుజువు చేస్తోంది.  

2014లో టీడీపీ తిరిగి ఎన్నికైన తర్వాత బెల్టు షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించినా, దానిని ఆయన విస్మరించిన ఫలితంగా నలభై ఐదువేల బెల్టు షాపులు అవతరించాయి. ఇక పర్మిట్‌ రూమ్‌ల పేరుతో ఎంత చెడ్డపేరు తెచ్చుకుందీ అందరికీ తెలుసు. మద్యాన్ని టీడీపీ నేతలు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కానీ జగన్‌ సీఎం అయ్యాక బెల్టు షాపులు దాదాపు లేకుండా చేశారు. ప్రైవేటు షాపులను ఎత్తివేసి ప్రభుత్వపరం చేశారు. ఇది ప్రజలలోకి బాగానే వెళ్లింది. దీనిని చెడగొట్టడం కోసం తంటాలు పడటంలో భాగంగానే జంగారెడ్డి గూడెం యాగీని టీడీపీ సృష్టించింది. వీరు ఆ ఊరు వెళ్లేవరకూ అక్కడ అంతా ప్రశాంతంగానే ఉండటం గమనార్హం.

ఇంకో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. ఒక నాయకుడు గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన పాతికేళ్ల క్రితం సారా వ్యాపారం చేసేవారు. ఆ సందర్భంలో ఏదో ఘటన జరిగి అసెంబ్లీలో పెద్ద వివాదం అయింది. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఒక మంత్రికి ఆయన సన్నిహితుడని చంద్రబాబు ఆరోపించారు. దానిపై ఆ మంత్రి మండిపడ్డారు. సీన్‌ కట్‌ చేస్తే ఆ వ్యాపార నాయకుడు తెలుగుదేశంలో చేరి అత్యంత ముఖ్యమైన నేతగా ఎదిగారు. చంద్రబాబుకు సన్నిహితుడుగా చక్రం తిప్పారు. తదుపరి టీడీపీ అధికారం కోల్పోయాక పార్టీ వీడారు. చంద్రబాబు రాజకీయాలు ఇలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ.

సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర సంపాదించడం చంద్రబాబు అదృష్టం. ఏపీలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పదవులలో ఉండటం కూడా గొప్ప విషయమే. కానీ ఆయన ఆ గొప్పతనం నిలబడేలా వ్యవహరించకుండా, చిన్నబుద్ధులతో ప్రతి దానికీ రాజకీయం పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయబోయి తాను అప్రతిష్టపాలు కావడం ఒక విషాదం.

వ్యాసకర్త
కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు     

Advertisement

తప్పక చదవండి

Advertisement