రాజకీయాల్లోనూ యువతను ప్రోత్సహించాలి

The Youth Should Be Given A Place In Politics As Well - Sakshi

భారతదేశ జనాభాలో 15–29 ఏళ్ల మధ్య ఉన్న యువత 27.5 శాతం ఉన్నారు. యువత జాతి ప్రగతికి సోపానం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగు తోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతోంది. 2020 నాటికి ప్రపంచములో అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశంగా భారత్‌ నిలిచింది. దేశ అభివృద్ధిలో ఈ యువ మానవ వనరు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగంలోనే ఉపయోగించుకోవడం సరికాదు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాల్లోనూ యువతకు తగిన స్థానం కల్పించవలసి ఉంది. అప్పుడే నిజమైన నవ సమాజ నిర్మాణం సాధ్యమ వుతుంది.

ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. వీటి నుంచే చాలా రాజకీయ పార్టీలకు నాయకులు లభించిన, లభిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆయా సంఘాలలో పనిచేసేవారికే కాక... చురుకుగా పని చేయ గలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలూ ప్రోత్సహించాలి. ఎన్ని కల సమయంలోనో... లేదా ఏవో కొన్ని ఉద్య మాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్నీ వాడుకుని వదిలేస్తుండటం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్‌. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు విడనాడాలి.

మైఖేల్‌ గ్రీస్‌ రాసిన ‘సామాజిక రాజకీయ మార్పులో క్రియాశీలక ప్రతినిధులుగా యువత’ అనే పుస్తకంలో యువతలో సానుకూల దృక్పథం కలిగించి, అభివృద్ధికి అనువుగా మలుచు కోవ డాన్ని ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో బలీ యమైన ఉద్యమంగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమ నించాలి. ఇప్పటివరకూ యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. 

రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్‌ నుంచీ అత్యు న్నత పార్లమెంట్‌ సభ్యుని వరకూ వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవి ష్యత్‌ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతి నిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్లా ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడ తాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచ్‌ లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులుగా, మున్సిపల్‌ ఛైర్మన్లుగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహా నగరాలకు మేయ ర్లుగా... ఇలా వివిధ పదవులను పొంది... పాలనలో ప్రాథమిక అనుభవం పొంద డానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్‌ ఉభయ సభలకూ పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచీ ఢిల్లీ వరకూ వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు.

నేదునూరి కనకయ్య
వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం ‘ 94402 45771 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top