‘ఏబీసీ’ ఏర్పాటు విద్యార్థికి మేలే గానీ...

What is Academic Bank of Credits in Higher Education and How it Affects You - Sakshi

ఇటీవల విశ్వవిద్యాలయాల నిధుల జారీ సంస్థ అయిన యూజీసీ నూతన జాతీయ విద్యా విధానంలో అకడమిక్‌ బ్యాంకు క్రెడిట్‌ (ఏబీసీ)లను ప్రారంభించాల్సిందిగా ఆదే శాలు జారీ చేసింది. అకడమిక్‌ బ్యాంకు క్రెడిట్‌ అంటే ప్రతి విద్యార్థికీ ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయడం అన్నమాట. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఏబీసీ పోర్టల్‌ ద్వారా అతను పూర్తిచేసిన వివిధ కోర్సుల మార్కులు, గ్రేడ్, ర్యాంకులను నిక్షిప్తం చేయడం జరుగుతుంది.

ఐదేళ్ళపాటు భద్రంగా దాచిన ఈ మార్కులు, గ్రేడ్లను విద్యార్థి తదనంతర కాలంలో తిరిగి చదువు కొనసాగించాలన్నా, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన చదువును సాగించాలన్నా... తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏబీసీల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా... విద్యార్థి సంపాదించిన కోర్సు సర్టిఫికెట్లకు గుర్తింపు ఇవ్వడం అనివార్యం అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లకు కొన్నిచోట్ల గుర్తింపు లభించడం లేదు. ఏబీసీల్లో స్టూడెంట్‌ విద్యాపరమైన అన్ని విష యాలనూ నిక్షిప్తం చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.

మరో ప్రయోజనం ఏమిటంటే... ఏబీసీ పోర్టల్‌కు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒక విద్యార్థి ఒక విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినా మరొక విశ్వవిద్యాలయంలో మరొక కోర్సు చదివే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి బొంబాయిలోని కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతుండగా అతనికి ఇష్టమైన కృత్రిమ మేధ అనే ఐచ్ఛిక కోర్సు ఆ కళాశాలలో బోధించనట్లయితే... అతను వేరొక ప్రదేశంలోని వేరొక కళాశాల నుండి ఆ కోర్సు చేసే వెసులు బాటు ఉంటుంది.

భారత ప్రభుత్వం అందిస్తున్న ‘స్వయం’, ఎన్‌పీటీఈఎల్‌ అందిస్తున్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోర్సులూ, మైక్రోసాఫ్ట్‌ వంటి గుర్తింపు పొందిన సంస్థలు అందించే కోర్సులను పూర్తి చేసి వాటి ద్వారా లభించిన క్రెడిట్‌లను విద్యా నిధిలో దాచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని కళాశాలలో చేరిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని పేరున్న కళాశాలలోని కోర్సులు చదివే అవకాశం ఇక నుండి ఏర్పడుతుంది. అంతేకాక ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఐఐఎంలలోని అత్యంత ప్రతిభావంతమైన అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేసే అవకాశం ఏర్పడనుంది. అయితే ఇవన్నీ కూడా చెప్పుకోడానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఆచరణలో మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. 

ఏబీసీ పోర్టల్‌ ద్వారా కోర్సులను అందించే విద్యాసంస్థలు తప్పనిసరిగా నాక్‌ ఏ గ్రేడ్‌ పొంది ఉండాలనే నిబంధనను ఒకటి విధించడం జరిగింది. కానీ నేడు దేశంలోని అనేక విద్యా సంస్థలు నాణ్యత ప్రమాణాలను పాటించనప్పటికీ నాక్‌ ‘ఏ’ గ్రేడు రావడం మనమందరం చూస్తున్నాం. ఏబీసీ విధానం ప్రకారం నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ పొందిన ఒక నాసిరకం విద్యాసంస్థ నుండి కోర్సు పూర్తి చేసిన విద్యార్థి అదే కోర్సు ఐఐటీ వంటి సంస్థల్లో పూర్తి చేసిన విద్యార్ధితో సమానంగా గుర్తింపు పొందుతాడు. ఇది ఎంతవరకు న్యాయం?

ఒకే కోర్సును  ఐఐటీ వంటి ఒక ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ, ఒక సాధారణ ప్రాంతీయ కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉంచినప్పుడు సహజం గానే విద్యార్థులు అందరూ కూడా ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవటానికి ఉత్సాహం చూపిస్తారు. ప్రాంతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గి బోధనలో నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఇందువల్ల చాలా విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే యూజీసీ అకడమిక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ల  ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి.

- ఈదర శ్రీనివాసరెడ్డి 
సామాజిక, ఆర్థిక విశ్లేషకులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top