సదానంద నడచిన బాట

Tribute to Author Sadhananda - Sakshi

నివాళి 

‘నేను ఆశించే మంచి రచయితలలో కలువకొలను సదానంద నిస్సందేహంగా ఒకరు’ అంటారు కొడవటిగంటి కుటుంబ రావు ‘గందరగోళం’ నవలకు రాసిన ముందుమాటలో. కొకు దగ్గర అంత గొప్ప కితాబు పొందగలిగిన అతికొద్దిమంది రచయితలలో సదానంద ఒకరు కావడం ఆశ్చ ర్యమేమీగాదు. ఆరు దశాబ్దాలపాటు నిర్వి రామంగా రాసిన కథలూ, నవలలూ, పిల్లల సాహిత్యమూ ఆయన అరుదైన సాహిత్య విశిష్టతకు నిలువెత్తు ఉదాహరణలుగా నిలిచి ఉంటాయి. 1962లో జరిగిన భారత్‌–చైనా యుద్ధం భూమికగా ఆయన 1965 ప్రాంతంలో రాసిన ‘బంగారు నడచిన బాట’ అనే పుస్తకాన్ని పరవశంగా పదేళ్ల ప్రాయంలో పదే పదే చదవడమ న్నది నా బాల్య స్మృతుల్లో ఇంకా పదిలంగా ఉంది. పంచ తంత్రపు కథల్లాంటి ‘అలెగొరీ’ పద్ధతిలో జంతువుల్నీ, పక్షుల్నీ, కోతినీ పాత్రల్ని చేసి ‘బంగారు’ అనే మనిషిని కథానాయకుడిగా చేసి ఆయన రాసిన ఆ నవల ‘గలీవర్స్‌ ట్రావెల్స్‌’లా అన్ని వయస్సుల వారినీ అలరించే గొప్ప రచన. నవల ముగింపులో బంగారు అడవిలో మృగాల్ని తినేస్తున్న సింహంతో సంధి చేసు కుని ‘శాంతి’ అన్నింటికంటే గొప్పదని ప్రకటిస్తాడు. అయితే సింహాన్ని నమ్మకుండా తుపాకీని కూడా సమకూర్చుకుంటాడు. ఆ నవలకు అప్పట్లోనే రాష్ట్రపతి పురస్కారం వచ్చింది.

చిత్తూరు జిల్లాలోని పెద్ద రైల్వే జంక్షనయిన ‘పాకాల’ అనే బస్తీలో 22 ఫిబ్రవరి 1939లో  పుట్టిన కలువకొలను సదానంద, ఆ ఊర్లోనే చదివి, ఆ వూర్లోనే బడిపంతులుగా ఉద్యోగం చేసి, అక్కడే పదవీ విరమణ చేసి, ఆ వూర్లోనే చివరివరకూ జీవించాడు. సాహితీ సమావేశాలకుగానీ, యాత్రలు, పర్యటనలకుగానీ పెద్దగా వేరే ఊర్లకు వెళ్లిన వారు కాదు. పాకాల అనే బస్తీ ఆయనకు మిగిలిన దేశాని కంతా చిన్న ప్రతీకలా తయారయ్యింది. దాదాపుగా ఆయన రచనలకన్నింటికీ ఆ వూరే నేపథ్యంగా ఉంది. సదానంద రాసిన ‘తాత దిగిపోయిన బంతి’, ‘ఇస్‌ ఝండేకే నీచే’, ‘రామదాసు చెర’, ‘రుద్ర భూమి’, ‘రంగురంగుల చీకటి’ వంటి కథల్ని చదివిన ప్పుడు పాకాల అనే బస్తీ అంతే స్పష్టంగా ఆవిష్కృతమవుతుంది. ఒకానొక స్వాతంత్య్ర దినోత్సవం రోజున బడిపిల్లలనంతా ఊరి మధ్యలో ఉండే పోలీసు గ్రౌండులో సమావేశపరుస్తారు. పిల్లలా ఎండలో ఎలా అవస్థ పడుతున్నారో పట్టించుకోకుండా ఊరి ప్రెసి డెంటు, ఆయన వంది మాగధులూ కొలువుచేస్తారు. ఎండలో నిలువుకాళ్ల ఉద్యోగం చేసే బడిపంతుళ్లను పట్టించుకోరు. చివరకు పిల్లలకిచ్చే మిఠా యిల్లో కూడా పెద్ద శాతం వాళ్లకు చేరదు. సమా వేశానంతరం పెద్ద బండిలో గాంధీపటం పెట్టి ఊరేగిస్తారు. మరు నాటి ఉదయాన చూసినప్పుడు అదే బండిలో మున్సిపాలిటీ వాళ్లు చెత్త పోగేస్తుంటారు. అంటే ఆ ఊరేగింపు కోసమని ఆ బండిని స్వాతంత్య్ర దినోత్సవంనాడు మాత్రం శుభ్రం చేసి వాడుకున్నా రన్నమాట. అది చూసి నివ్వెరపోతున్న పంతులుతో మరో పంతులు ‘ఆశ్చర్యపోతున్నావా సదానందం! అది ఇప్పుడు తాత దిగిపోయిన బండి’ అంటాడు.

ఈ కథలన్నింటికీ నేపథ్యమైన ‘పాకాల’ను మొత్తం భారత దేశానికంతా ప్రతీకగా సదానందగారు మలుస్తారు. ఆయన రాసిన ‘రక్త యజ్ఞం’, ‘గందరగోళం’, ‘గాడిద బ్రతుకులు’ నవలల్లోనూ ఇటువంటి హాస్యమూ, వ్యంగ్యమూ పాఠకుడ్ని సవాలు చేస్తాయి.  ‘ఓండ్రింతలు’ అనే పేరుతో ఆయన పాతికేళ్ల క్రితం రాసిన వ్యంగ్య కథలు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు కూడా వ్యాఖ్యానాలుగా ఉంటాయి. గొప్ప బాలసాహిత్యాన్ని సృజించిన అతికొద్ది మంది కథకుల్లో సదానందం ఒకరు. ‘విందు భోజనం’, ‘పైరగాలి’ లాంటి కథా సంపుటులూ.. ‘బంగారు నడిచిన బాట’, ‘అడవితల్లి’, ‘వట్టి చేతులు’ వంటి నవలలూ ఆయన పిల్లల కోసమే రాసినా అవి పెద్ద లనూ అలరిస్తాయి. ‘సాంబయ్య గుర్రం’, ‘కోతి బుద్ధి’ వంటి కథల్ని తల్చుకుని ఇప్పటికీ నవ్వుకునే పాఠకులున్నారు. పిల్లల కోసం ఆయన పాటల్ని కూడా చాలా రాశారు.
‘‘కలవారి అబ్బాయి కోటేశుగాడు / కొలిచి జానెడు ఇల్లు గట్టాడు
అద్దెకీబడునంచు అట్టగట్టాడు / దిష్టిబొమ్మకు దీటు తాను నిలిచాడు..’’ అంటూ  సాగిపోయే ఆయన పిల్లలపాట హాస్యంగానే ఉంటూ వ్యంగ్యంగానూ ఊపి పారేస్తుంది. కేంద్రసాహిత్య అకాడమీ వాళ్లిచ్చే పిల్లల సాహిత్య అవార్డు ముందుగా ఆయన రాసిన ‘అడవితల్లి’ నవలకే వచ్చింది. సదానంద చిత్రకారుడు కూడా. చిత్తూరు జిల్లాలో ప్రచురించిన అనేక పుస్తకాలకు ఆయన ముఖ చిత్రాలంకరణ చేశారు. ఎన్నో కార్టూన్లు కూడా గీశారు. దాదాపుగా రెండువందల కథలు, పదినవలలూ, పిల్లల కోసం మరో వందకు పైగా కథలూ, ఎన్నో పాటలూ రాసినవాడాయన. 

ఆరేడేళ్ల క్రితం కంటి చూపుకోసం ఆపరేషన్‌ చేసినప్పుడు దురదృష్టవశాత్తూ ఆయన చూపు పోయింది. అందువల్ల తన చివరిరోజుల్లో రాయవలసింది రాయలేక ఆయన చాలా బాధ పడ్డారు. 1950 నుంచి 2000 వరకు సాగిన తెలుగు కథానికా స్వర్ణయుగానికి చెందిన చివరి కథకుడు కలువకొలను సదానంద గారు. 82 ఏళ్ల వయస్సులో ఆయన ఈ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం ఈ ప్రపంచాన్ని విడిచిపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గొప్ప సాహిత్య దిగ్గజం వెళ్లిపోయిందని అనడం కంటే తెలుగు సాహిత్యపు ఆధునిక సాహితీ కెరటమొక్కటి విశ్రాంతి తీసుకుందని అనడమే సబబుగా ఉంటుంది.

వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత
మధురాంతకం నరేంద్ర 
మొబైల్‌ : 98662 43659

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top