వ్యాక్సిన్‌ల సామర్థ్యం తెలిసేదెలా?! | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ల సామర్థ్యం తెలిసేదెలా?!

Published Tue, Oct 10 2023 12:20 AM

Sakshi Guest Column On Vaccines

‘‘ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్‌ల సృష్టి జరుగుతూన్న సందర్భంగా సదరు వ్యాక్సిన్‌లు సరిగ్గా పని చేసేవా, లేదా అని తేల్చుకోవాలంటే – ముందు ఆ వ్యాక్సిన్‌లను రాజకీయ పాలకులపై ప్రయోగించి చూడాలి. ఎందుకంటే, తీసుకున్న వ్యాక్సిన్‌ వల్ల ఆ పాలకులు బతికి బట్టకడితే ఆ వ్యాక్సిన్‌ మంచిదని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ పాలకులు ఆ వ్యాక్సిన్‌ వల్ల స్వర్గస్థులయితే, దేశం సుఖంగా ఉన్నట్టు భావించాలి.’’
– ప్రసిద్ధ పోలిష్‌ తాత్వికులు మోనికా విర్నివా స్కా

ఈ బండ ‘జోకు’ వినడానికి కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గత పదేళ్లకు పైగా ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యం కన్నా, వ్యాపార లాభాల కోసం పెక్కు ప్రయివేట్‌ కంపెనీలు వ్యాక్సిన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వస్తున్నాయి. అవి సృష్టించే వ్యాక్సిన్‌లు ప్రముఖ శాస్త్రవేత్తల కొలమానాలకు అందకపోయినా, తిరస్కరిస్తున్నా మార్కెట్‌లోకి పాలక వర్గాల అండతో విడుదలవుతూండటం చూస్తున్నాం. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎండకట్టి అనుక్షణం, ఈ రోజు దాకా ప్రశ్నిస్తూ వస్తున్న ప్రసిద్ధ భారత కరోనా శాస్త్రవేత్త, పరిశోధకురాలు గగన్‌దీప్‌ కాంగ్‌! వైరస్‌ల స్థాయి ఎంత తీవ్రమైనదంటే – భవిష్యత్తులో సోకగల ప్రమాదాలను కూడా ముందుగానే ఊహించి రోగ నిర్ణయానికి అవసరమైన ప్రయివేట్‌ స్థాయి అవకాశాలను కూడా గణించి, ప్రయివేట్‌ కంపెనీలను షరతులతో అదుపులో ఉంచుతూ రంగంలోకిదించాలని ఆమె పదేపదే ముందస్తుగానే సూచిస్తూ వచ్చారు.

ఈ రోజు కాకపోతే రేపు అయినా పాలకులు అను మతించిన ప్రయివేట్‌ కంపెనీలను అదుపాజ్ఞల మధ్య వాడుకోవలసి ఉంటుందన్నారు. ప్రపంచ క్లినీషియన్‌ శాస్త్రవేత్తలలో భారతదేశ ఉద్దండురాలుగా ఆమెను గుర్తిస్తూ లండన్‌ రాయల్‌ సొసైటీ ‘ఫెలోషిప్‌’ ఇచ్చి గౌరవించింది. రాయవెల్లూరు మెడికల్‌ కాలేజీలో వైద్య శాస్త్ర పరిశోధనా కేంద్రంలో పిల్లల్లో ప్రబలుతున్న వైరల్‌ వ్యాధులపై ఎనలేని పరిశోధన చేశారు.

అంతేకాదు, పిల్లలకు సంబంధించి పటిష్ఠమైన ఆరోగ్య జాగ్రత్తలను ప్రాథమిక దశ నుంచే తీసుకోవడం వల్ల ఉత్తరోత్తరా వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పే అవసరం ఉండదనీ, ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే కనీసం వంద దేశాల్లో లక్షలాది చిన్నారులు దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చిందనీ గగన్‌దీప్‌ కాంగ్‌ ఆందోళన వెలిబుచ్చారు. మానవాభ్యున్నతి గణింపులో గత పదిహేనేళ్లలో భారత అభి వృద్ధి సూచీ 3 స్థానాలు దిగజారి పోయింది. ఈ గణింపులో చిన్నారుల మరణ శాతం కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది మరువరాదు. 

ప్రజల జీవన ప్రమాణాలను పెంచవలసిన పాలకులు ఎప్పటికప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక వాద సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. మత రాజకీయాలను పెంచి పోషిస్తూ ‘హిందూ జాతీయవాదాన్ని’ రేకెత్తించి నియంతృత్వ పాలనను స్థాపించడానికి కావల సిన వాతావరణాన్ని సృష్టించుకొంటున్నారు. దీన్ని ఊహించే భారత రాజ్యాంగ నిర్మాత ‘భారత రాజ్యాంగంలో ఆచరణకు పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలను ఇతరులు ప్రజాస్వామ్య విరుద్ధంగా మార్చేసే ప్రమాదం లేకపోలేదు, నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రమాదమూ లేక పోలేదు’ అని హెచ్చరించారు. 

దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో హిందూ మత రాజకీయాల వల్ల అన్యమతస్థులకు స్థానముండదనీ, ప్రజాస్వామ్య లక్ష్యాలతో పొందుపరిచిన భారత సెక్యులర్‌ వ్యవస్థను అపహాస్యం చేస్తూ గాంధీజీ హంతకుడు గాడ్సే కాలం నాటి పరిస్థితులను ‘సెక్యులరిజం’ పేరు చాటున తాము కూడా పాలనలో కొనసాగించ దలచినట్లు ‘బీజేపీ – ఆరెస్సెస్‌’ నాయకుల ప్రస్తుత ధోరణులు కనిపిస్తున్నాయనీ ‘వర్జీనియా యూని వర్సిటీ’ భారతీయ ప్రొఫెసర్‌ నీతీ నాయర్‌ ‘గాయపడ్డ మనస్సులు’ (2021) గ్రంథంలో పేర్కొన్నారు.

ప్రత్యేక ‘హిందూ రాష్ట్రం’ సెగ ఒక మతాన్ని కాదు – ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బౌద్ధులు అందర్నీ చుట్టుముడుతుందనీ, అందుకని, మన భారత ప్రజలు ప్రత్యేక ‘హిందూ రాష్ట్ర ప్రతిపత్తి’కీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అక్షర సత్యంగా పొందుపరిచిన ‘సమగ్ర భారతదేశ’ భావనకూ మధ్య వాస్త వాన్ని విధిగా ప్రేమించాలని ప్రొఫెసర్‌ నీతీ నాయర్‌ ఆ గ్రంథంలో పేర్కొ న్నారు. ఇటీవల ‘మహిళా రిజర్వేషన్ల’ సమస్యపై బీజేపీ పాలకులు నడిపిన తంతుపై సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్‌ వేసిన పాకెట్‌ కార్టూన్‌ (23.9.2023) వీరి రాజకీయాలను పట్టిస్తుంది.

‘మీ మహిళా రిజర్వేషన్ల కోటా 2039లో వస్తుంది. అయితే దాన్ని పెద్దగా ఆలస్యమైనట్టు మీరు భావించకండి. 2024లోనే మీ కోటాను మీకు కాగితం మీద కల్పిస్తాం. కానీ ఈలోగా, అంటే 2024లోనే మీ ఓటును మాకు ముందస్తు క్రెడిట్‌గా వేయండి’ అని ప్రధాని ముక్తాయించడం అసలు ‘చరుపు’! కానీ, ఆ 2039 నాటికి ఎవరుంటారో, ఎవరు ఊడతారో మాత్రం తెలియకపోవడం అసలు ‘మర్మం’!
అందుకే అన్నాడేమో వేమన:
‘‘కులము గలుగువారు, గోత్రంబు గలవారు
విద్య చేత విర్రవీగు వారు,పసిడి గల్గు వాని బానిస కొడుకులు!’’

ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in  
సీనియర్‌ సంపాదకులు 

 
Advertisement
 
Advertisement