దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం | Sakshi Guest Column On Shyama Prasad Mukherjee | Sakshi
Sakshi News home page

దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం

Jul 6 2026 12:19 AM | Updated on Jul 6 2026 12:19 AM

Sakshi Guest Column On Shyama Prasad Mukherjee

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంత్యోత్సవాల నేపథ్యంలో...

సందర్భం

ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. 

ఆత్మార్పణ
డా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్‌ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్‌ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్‌ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.

భారతీయతకు పెద్దపీట
ఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్‌ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్‌ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్‌’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. 

పారిశ్రామిక విధానానికి పునాది 
ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్‌ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్‌ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్‌ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. 

సేవామూర్తి
మానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్‌ మన్వంతర్‌’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.

ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్‌ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 


నరేంద్ర మోదీ
భారత ప్రధాని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement