అస్తమించని మేధా సూర్యుడు

Sakshi Guest Column On Dr BR Ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. 

అంబేడ్కర్‌కి పూర్వం, అంబేడ్కర్‌ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్‌ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి.

అంబేడ్కర్‌ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్‌కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్‌ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్‌ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు.

అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్‌ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు.

ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్‌ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్‌వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు.

అంబేడ్కర్‌ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు.

ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్‌ నాయక్‌’, ‘బహిష్కృత్‌ భారత్‌’, ‘జనత’, ప్రబుద్ధ భారత్‌’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.

అంబేడ్కర్‌ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్‌ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం.

అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్‌ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్‌ జె.టి. గోర్మన్‌ తన ‘హిస్టారికల్‌ రికార్డ్‌ ఆఫ్‌ ది సెకండ్‌ బెటాలియన్‌ ఫోర్త్‌ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్‌ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్‌లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. 

అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్‌ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్‌ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి.

భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్‌ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది.

ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్‌ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్‌కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్‌ అవసరం పెరిగింది. 

ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్‌ మేధావిగా గుర్తింపు పొందారు.  లండన్‌లోని ‘ఇండియా హౌస్‌’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్‌లో సరేసరి. ఇండియన్‌ పార్లమెంట్‌ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్‌ నడిబొడ్డులో అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది.

ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. 
డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
(రేపు డా‘‘ బి.ఆర్‌. అంబేడ్కర్‌ వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top