శిశువుల చిత్రనిద్రలో బాంబుల చప్పుడు | Sakshi
Sakshi News home page

శిశువుల చిత్రనిద్రలో బాంబుల చప్పుడు

Published Fri, Nov 10 2023 4:54 AM

Sakshi Guest Column On Child Deaths Of Palestine

ఒళ్ళంతా బూడిద వర్ణం నిండి పోయిన ఆ బాలుడు గూడు చెదిరిన పిట్టలా రోడ్డుమీద అయోమయంగా గిరికీలు కొడుతున్నాడు. భయమో, ఏడుపో, ఆందోళనో, వెతుకు లాటో తెలీని ఆ పదేళ్లవాడిని ఎవరో ఆపి, ఏదో అడుగు తున్నారు. తన ఖాళీచేతుల వంక చూసుకుంటూ, ‘‘ఇపుడే బాల్‌ ఇద్దామని వచ్చాను, వాడు కారుకింద దాక్కున్నాడు. ఇంతలో మాకు దగ్గరలో బాంబు వేశారు వాళ్ళు.

మా మేనల్లుడి వీపుకి గాయం అయింది. వాడిని మోసుకుని ఇంటికి వెళ్ళాను. మా పొరుగువాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళకి బుజ్జి బాబు ఉన్నాడు. వాడి తలంతా పగిలిపోయి మెదడు బైటకి వచ్చింది. మేము ఎలా బతకాలి, ఇది జీవితం కాదు’’ మాటల శిథిలాలను వదిలి మళ్ళీ పరుగందుకున్నాడు. 

శోక సముద్రపు అలలా, తీరం లాంటి తండ్రి గుండెకి తలని మోదుతూ ఎగిరెగిరి పడుతున్నది ఎనిమిదేళ్ళ పిల్ల. ‘‘మా తాతయ్యని, నాన్నమ్మని, చిన్నాన్నని, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశారు. వాళ్ళు అమరులయ్యారట, కానీ మా అమ్మని తమ్ముడిని ఎలా చంపుతారు, అమ్మ లేకుండా నేనుండలేను’’ ఆ చిన్న గొంతులో ఎవరం వినగూడని ఉద్వేగం.   

లోకపు భయం అంతా ఒకముద్దలా మార్చి రెండు కళ్ళలో కూరినట్లు, ఆసుపత్రి బల్లమీద కూర్చున్న రెండు మూడేళ్ల చిన్నవాడు లోకపు నాగరికతని ముక్కలు ముక్కలు చేసేశాడు. వాడి పసినిద్రని చెల్లాచెదరు చేసిన బాంబుదాడి బీభత్సం అంతా ఆ విప్పార్చిన కళ్లలో కనిపించింది. అది చూసి తట్టుకోలేని డాక్టర్‌ వాడిని దగ్గరికి తీసుకుని ‘‘నాన్న దగ్గరికి తీసుకువెళ్లనా?’’ అనడ గగానే భయం బద్దలయి, కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.  

పాలస్తీనా మీద ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు అయిదు వేలమంది పాలస్తీనా చిన్నారులు చనిపోయారు. ప్రతి పది నిమిషాలకూ ఒక చిన్నారిని మరణంలోకి నెట్టి వేస్తున్నది మాయదారి యుద్ధం.

గాయపడినవారి లెక్కకి అంతే లేదు. శిథిలాల కిందన, రోడ్ల మీదా, ఆసుపత్రులలో, శిబిరాలలో నెత్తురోడుతున్న పిల్లలు... పిల్లలు... పసి కూనలు! ఏడుస్తూ అరుస్తూ, కాళ్లతో చేతులతో అందరినీ విసిరికొడుతూ, భయంతో నక్కి నక్కి దాగుతూ, ప్రతినలు పూనుతూ, అయినవారి శవయాత్రల్లో కక్కటిల్లిపోతూ, ఆసుపత్రుల్లో కింక పెడుతూ, శూన్యంలోకి చూస్తూ, నిశ్చేష్టులవుతూ, లోకపు నిర్దయని ఛీత్కరిస్తూ – పాలస్తీనా బాల్యం, హృదయమున్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.

బిడ్డ గుక్కపట్టి ఏడిస్తేనే కిందుమీదులయ్యే సున్నితమైన పెంపకాల మధ్య ఈ సామూహిక రోదనలు వినడం అత్యంత విషాద సందర్భం. ఇజ్రాయెల్‌కూ, తమ మత ప్రయోజ నాలకూ కొమ్ము కాసే ఒక తరహా మీడియా, పసిపిల్లల బాధాకర వీడియోలను నటనలుగా వక్రీకరిస్తున్నది. వేలాది పిల్లల ఆర్తనాదాలలోని సహజత్వాన్ని పరీక్షకు పెట్టేంత బండబారిపోయామా!

లోకంలో ఎక్కడైనా పిల్లల భద్రతకి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే  భావి పౌరుల ఎదుగుదలని బట్టే సమాజపు ఎదుగుదల ఉంటుంది కనుక. పిల్లల మనసు తెల్ల కాయితం లాంటిది. దాని మీద వారు తొలిగా అమ్మ, నాన్న, తోబుట్టువుల బొమ్మలు గీసుకుంటారు. ఆ మూలన సూర్యుడు, దానిమీద అడ్డంగా ఎగురుతున్న రెండు పక్షులు, ఒక స్కూలు, నలుగురు స్నేహితులు, కాసిన్ని ఆటపాటలు.

ఇంతకి మించిన భారాన్ని వారి చిట్టి మనసులు మోయలేవు. ప్రపంచవ్యాప్తంగా జాతి, వర్ణ, కుల, సామాజిక, ఆర్థిక, ఇతరేతర వివక్షలకి తగిలిన గాయాలను పిల్లలు శతాబ్దాలుగా మోసుకు తిరుగుతున్నారు. వీటికి అదనం యుద్ధాల వంతు. ఇపుడు లక్షలాది పాలస్తీనా చిన్నారుల తెల్లకాయితాల మీద యుద్ధం – ఎరుపు, బూడిద రంగుల హర్రర్‌ వాక్వీ య్‌ను చిత్రిస్తుంది. 

వేలాది చిన్నారుల్లో, వారి మొహాల్లో, హావభావ కవళికల్లో కొట్టొచ్చినట్లు కనపడుతున్నవి, షాక్, ట్రామా. ఇవి సబ్‌ కాన్షియస్‌ మీద వేసే ముద్రలు సామాన్యమైనవి కావు. కూడూ, గూడూ, దుస్తులూ హాయిగా అమిరాక కూడా మన అభిప్రాయాలు, విశ్వాసాలే గొప్పవని నమ్మి, వాటిని గెలిపించడం కోసం ఎంతకైనా తెగించే నాగరీక లోకమిది. ఇక బతుకే ఊగిసలాటలో పడిన పసిపిల్లలు, భవిష్యత్తులో శాంతి కాముకులవుతారని నమ్మగలమా! రక్తపాతం సృష్టించిన వారు పశ్చాత్తాపంతోనో, తమ ప్రాణాల మీది తీపితోనో శాంతి మంత్రం జపించవచ్చు గాక. కానీ బాధితులను శాంతిగా ఉండమని చెప్పడమంత లౌక్యం, అమానుషం మరొకటి ఉండదు. 

పిల్లల విషయంగా పాలస్తీనా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సమస్యలు రెండు. మానసిక కల్లోలా లను అదుపు చేసుకోలేక పిల్లలు స్వీయహింసకి పాల్పడడం, లేదా ఇతరుల పట్ల, ముఖ్యంగా తమని వేధించినవారి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడం. కుక్కలు, తూనీగలు, పురుగులు, పిట్టల వంటివాటిని– పిల్లలు తెలిసీ తెలియక హింసిస్తుంటారు.

ప్రాణుల పట్ల దయగా ఉండాలని రేపుమాపు ఎవరైనా బోధించబోతే వారు తప్పక ఒక ప్రశ్న అడుగుతారు, ‘పాలస్తీనా ప్రజలు ప్రాణులు కారా?’ అని. ఇంత నలుగుడు పడి మనమేమి చేయగలం? నాలుగు కొవ్వొత్తులు, ప్లకార్డులు పట్టుకుని  నిరసన తెలపడం, నాలుగు అక్షరాలు రాయడం, మీతో మేమున్నామని పాలస్తీనీ యులకు తెలపడం, నలుగురు కూచుని నవ్వేవేళల –యుద్ధంతో ఛిద్రమవుతున్న బాలలు తలపున పడి చాటుగా కళ్ళు తుడుచుకోవడం తప్ప, మనమేమి చేయగలం!

కె.ఎన్‌. మల్లీశ్వరి 
వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే 
malleswari.kn2008@gmail.com

Advertisement
 
Advertisement
 
Advertisement