అయోధ్యలో నూతనోదయం

Sakshi Guest Column On Ayodhya Sri Ram Janmabhoomi

జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్‌ గన్‌ పాంతి!!
రఘుకుల తిలక సుజన్‌ సుఖదాత! ఆయౌ కుసల్‌ దేవ ముని త్రాతా!!

శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్‌ రాఘవ్‌ రామ్‌లల్లా’ తన జన్మస్థలమైన అవధ్‌పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్‌–రామ్‌’ అని జపిస్తారు.

తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది.

‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్, విశ్వ హిందూ పరిషత్‌ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్‌మ్యాప్‌ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది.

ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్‌ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు!

2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్‌ మహంత్‌ వైద్యనాథ్‌ జీ మహారాజ్‌ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది.

విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్‌ మహంత్‌ శ్రీ దిగ్విజయ్‌నాథ్‌ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్‌ బ్రహ్మలీన్‌ మహంత్‌ శ్రీ వైద్యనాథ్‌ జీ మహారాజ్‌తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం.

శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది.

శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్‌పంథ్‌ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్‌లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.

ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్‌ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్‌ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి.

కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి.

శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్‌లలా పవిత్రోత్సవం యావత్‌ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది.

అవధ్‌పురిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్‌ నర్‌ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి.
శ్రీ రామః శరణం మమ
జయ–జయ శ్రీసీతారామ్‌!


యోగి ఆదిత్యనాథ్‌ 
వ్యాసకర్త ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top