యూపీలో మొదలైన ఓట్ల ఆట

Radhika Ramaseshan Article On Uttar Pradesh Panchayat Polls - Sakshi

విశ్లేషణ

పంచాయతీ ఎన్నికల తొలివిడతలో ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం, కౌశలం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో సమానంగా పోటీ పడటంలో... పార్టీనీ లేదా కూటమినీ సిద్ధం చేయడంలో అది సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ముందస్తు రాజకీయ చర్యలతో మిగతా పార్టీలకంటే ప్రయోజనం పొందడంలో బీజేపీ ముందంజలో ఉంటున్నట్లే లెక్క. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామనీ, వైరస్‌ను రాష్ట్రం నుంచి నిర్మూలించేశామనీ అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ ప్రజాగ్రహం, వేదనను ఇవి తొలగించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఈ మనోభావాలను బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్‌కి వ్యతిరేకంగా యూపీ ప్రతిపక్షాలు మల్చగలవా అనేది ప్రశ్న.

ఉల్లాసం, ఆనందం తర్వాత నిరాశ, నిస్పృహ వెంటాడుతాయి. దాంతోపాటు గాల్లో తేలియాడుతున్న మన కాళ్లు కూడా నేలమీదకొస్తాయి. సరిగ్గా ఈవిధంగానే ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వంపై వనరులు, కండబలం, హస్తలాఘవం, నిర్బంధం, అధికార దుర్వినియోగం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినప్పటికీ, పంచాయతీ ఎన్నికల అంతిమ ఫలితాల నేపథ్యంలో వాటికి అర్థం ఏమిటన్న అంశం విషయంలో అవి కఠిన వాస్తవాలతో ఘర్షణ పడాల్సివచ్చింది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఈ ఏప్రిల్‌ నెలలో ప్రత్యక్షంగా జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ తొలిదశలో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు రెండూ విజయాలు సాధించాయి. ఓటర్లు ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలకు విశిష్టంగా ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఎస్పీలను నిలిపారు. ఇకపోతే కాంగ్రెస్‌ తదితర పార్టీలు తర్వాత స్థానాల్లో నిలిచి వెనుకబడ్డాయి.

కానీ మండల ప్రముఖ్‌లను, జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్లను ఎన్నుకునే సమయానికి ఈ విజయగాథ తీరు కాస్తా మారిపోయింది. వీరిని పరోక్ష ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి పంచాయతీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. డబ్బు, కండబలం ఉపయోగించి ఫలితాలను తారుమారు చేసేందుకు ఎక్కువ అవకాశముండే ఈ రెండవ, మూడవ స్థాయి ఎన్నికల్లో గెలుపొందడంలో అధికార బీజేపీ ముందంజలో నిలిచింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్టీ చిహ్నాలతో పోరాడటం జరగదు. అయినప్పటికీ ఏ అభ్యర్థి ఏ పార్టీ మద్దతు పొందారు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగింది కూడా. తార్కికంగా చూస్తే, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థుల నుంచి ఎలక్టోరల్‌ కాలేజీని రూపొందిస్తారు కాబట్టి బీజేపీ సాధారణంగా బ్లాక్, పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవాల్సి ఉంది. కానీ అభ్యర్థులను బెదిరిం చడం, హింస, దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తినప్పటికీ, బీజేపీ బ్లాక్‌ స్థాయిలో (75కు గాను 67 స్థానాలు) జిల్లా పంచాయతీల్లో (825కి గాను 635 స్థానాలు) అధ్యక్ష పదవులను గెల్చి చక్కటి మెజారిటీ సాధించింది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా సహాయపడే గ్రామీణ ప్రాతినిధ్య సంస్థలపై బీజేపీ తన పట్టు నిలుపుకున్నట్లయింది.

బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించాయి. గతంలో హిందుత్వ ఆధిపత్య రాజకీయ వాతావరణంలో తనపై పడిన మైనారిటీ అనుకూల ముద్రను చెరిపేసుకోవడంలో స్పష్టత ప్రదర్శించినట్లు కనిపించిన సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఇప్పుడు ముస్లింలపై దృష్టి పెట్టారు. యూపీ రాజధానిలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్‌ తొలి సమావేశం ప్రధానంగా ముస్లింలైన చేనేతకారులతో, లక్నో సమీపంలోని మలిహాబాద్‌కి చెందిన మామిడితోటల పెంపకందార్లతో జరగడం విశేషం. ‘ప్రజాతీర్పును కొల్లగొట్టారు’, ‘రామాలయ విరాళాలు దొంగిలించారు’, ‘కోవిడ్‌–19 నిర్వహణలో వైఫల్యం చెందారు’ అనే నినాదాలతో బీజీపీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అఖిలేష్‌ విరుచుకుపడ్డారు.

పంచాయతీ ఎన్నికల్లోలాగా ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో పోటీ పడటానికి లేదా కూటమిని సిద్ధం చేయడంలో సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. తాను తీసుకొస్తున్న జనాభా విధానం ఏ మతాన్ని కూడా గాయపర్చకూడదనే భావానికి బీజేపీ స్థిరంగా దూరం జరుగుతున్నందున నూతన జనాభా పాలసీ ఇప్పుడు మైనారిటీలను భయపెడుతోంది. బీజేపీ నేతలు కొందరు ఎమర్జెన్సీ కాలానికి తిరిగి వెళుతూ ‘మనమిద్దరం, మనకిద్దరు’ అనే సంజయ్‌ గాంధీ నినాదాన్ని వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. అత్యవసర పరిస్థితిలో ముస్లింలను సామూహికంగా, నిర్బంధంగా కుటుంబ నియంత్రణకు బలవంతపెట్టడంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉత్తరాదిలో మట్టిగరిచిపోయింది. యూపీలో విభిన్న సామాజిక వర్గాలను రాజకీయపరంగా చీల్చివేయాలనే తన ప్రాథమిక ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన ప్రతీ చర్యను చేపట్టే విషయంలో యోగి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

కాగా, నాలుగేళ్లుగా గాఢనిద్రలో ఉండి గత వారమే మేల్కొన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ బ్రాహ్మణుల మనస్సును గెల్చుకోవడానికి తన పథకాన్ని ప్రకటించింది. అనేక కారణాల వల్ల యోగిపట్ల బ్రాహ్మణులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాన్పూర్‌కి చెందిన సవర్ణుడు, తన ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా తోడ్పాటుతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల హృదయాలను గెల్చుకోవడంలో బీఎస్పీ ప్రెసిడెంట్‌ మాయావతి విజయం సాధించారు. ఆయనకు బ్రాహ్మణ సమాజంతో చక్కటి అనుసంధానం కలిగి ఉండటం మాయావతికి ఎంతగానో కలిసొచ్చింది. ఆనాటి ఎన్నికల్లో 51 మంది బ్రాహ్మణ అభ్యర్థులను మాయావతి నిలబెడితే 20 స్థానాల్లో వారు గెలవడం సంచలనం కలిగించింది. కానీ 2017లో బీఎస్పీ నిలబెట్టిన 52 మంది బ్రాహ్మణ అభ్యర్థుల్లో నలుగురు మాత్రమే గెలుపొందారు. పైగా బ్రాహ్మణ సమాజం ఇప్పుడు బీజేపీవైపు తిరిగిపోయింది. బ్రాహ్మణులను బీజేపీకి దూరం చేయాలంటే మాయావతి వారికి విశ్వసనీయ సందేశం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యూపీలోని సంక్లిష్ట సామాజిక చట్రంలో ప్రస్తుతం బ్రాహ్మణుల మనస్సు గెల్చుకోవాలనుకుంటున్న మాయావతి సామర్థ్యం ముందుగా తన కీలకమైన దళిత ఓట్లను నిలిపి ఉంచుకోవడం పైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి 2014 నుంచి యూపీలోని పలు దళిత ఉపకులాలు బీజేపీ వైపు తిరిగిపోయాయి. పైగా సహరాన్‌పూర్‌కి చెందిన యువ లాయర్, కార్యకర్త చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావన్‌ తాను స్థాపించిన ఆజాద్‌ సమాజ్‌ పార్టీ పతాక కింద దళిత ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.  మాయా వతికంటే చాలా చిన్నవాడే అయినప్పటికీ, కులాలవారీగా జన గణన చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని ఆజాద్‌ చర్చకు పెడుతున్నారు. కానీ బీఎస్పీ సంవత్సరాలుగా ఈ అంశంపై సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం గమనార్హం.

మరోవైపున కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చాలా కాలం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మూడురోజుల పర్యటన చేశారు. యూపీపై మరింత ఎక్కువ సమయం గడుపుతానని ఆమె గతంలో ప్రకటించి ఉన్నారు. ఆమె ప్రస్తుత పర్యటనలో చిన్నచిన్న పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నదని సంకేతాలు వెలువరించారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను పణంగా పెట్టి ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోమని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి నిజంగానే యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు లాగా కార్యకర్తలు ఉన్నట్లయితే, 1989 నుంచి యూపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చతికిలబడిపోవడానికి బదులుగా రాజ కీయ క్రీడలో ఆ పార్టీ కూడా కొనసాగుతూ వచ్చేది.    
 
మరోవైపున కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణలో విఫలమై ప్రజ లను వారి ఖర్మానికి వారిని వదిలేశారని యూపీ సీఎం తీవ్ర విమర్శల పాలైనప్పటికీ తనలోని సహజాతాల కారణంగా వచ్చే ముందస్తు ప్రయోజనాలను బీజేపీ కొనసాగిస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని, వైరస్‌ నిర్మూలనను తన గొప్పగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటిస్తున్నప్పటికీ, అది ప్రజాగ్రహాన్ని, వారి వేదనను చల్లార్చడానికి సరిపోదు. మరి క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను ప్రతిపక్షం సొంతం చేసుకుని బీజేపీ, ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించగలదా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.


రాధికా రామశేషన్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top