Union Budget 2023: PapaRao Guest Column On Does Public Have Share In Union Budget - Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌: పంపకంలో ప్రజలకు వాటా దక్కేనా?

Published Wed, Feb 1 2023 3:28 AM | Last Updated on Wed, Feb 1 2023 9:31 AM

PapaRao Guest column on Does Public have share in Union Budget - Sakshi

నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని ఉన్న దశాబ్దాల రికార్డు స్థాయి నిరుద్యోగం, పెరిగిపోతోన్న కటిక పేదల సంఖ్య, నింగినంటుతోన్న ధరలు, పడిపోతోన్న దేశీయ ఆర్థిక వృద్ధిరేటు వంటి సమస్యల వలన నేడు ప్రజల దృష్టి, ఈ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్‌ ఏమైనా చేయగలదా అనే దానిపై కేంద్రీకరించి ఉంది. ఏ బడ్జెట్‌ అయినా ఒక్కసారిగా, ఆ ఒక్క ఆర్థిక సంవత్సర కాలంలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించేయలేదు. కానీ, అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఆ దిశగా సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయటం వీలయ్యేదే! ఆ పని తాజా బడ్జెట్‌ చేస్తుందా?

ఒక దేశం తాలూకూ బడ్జెట్‌ను, ఆ దేశంలోని సంపదను సృష్టించే ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం తదితర సామాన్య జనానికి మేలు చేసే విధంగానూ రూపొందించొచ్చు; ధనవంతులు, కార్పొరేట్లు లేదా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపుదారుల ప్రయోజనాల కోసమూ రూపొందించవచ్చు. మన దేశీయ బడ్జెట్లు ఇప్పటివరకూ ఏ తరహాలో రూపొందాయి? దీనికి జవాబు సరళం. గతంలో మన బడ్జెట్లు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్న సంపదలో అత్యధిక వాటా దానిని సృష్టించిన ప్రజలకు పంపిణీ చేసి ఉంటే, నేడు మన దేశంలో ‘కె’ (ఆంగ్లాక్షరం కె ఆకృతిలో; ధనవంతులు పైకి, పేదలు కిందికి) తరహా తీవ్ర ఆర్థిక అసమానతల పరిస్థితి ఉండేది కాదు. ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నా మన దేశం పై స్థానంలో ఉండడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల క్రమంలో సంపద సృష్టి జరిగింది. కానీ, ఆ సంపద సృష్టికర్తలకు చేతిలో మొబైల్‌ ఫోన్‌ మినహా దక్కిందేమీ లేదు. ఈ సంస్కరణలు తెచ్చిన ప్రైవేటీకరణ విధానాలు కనీస అవసరాలైన విద్య, వైద్యాలను ఖరీదైనవిగా మార్చేశాయి.

మొత్తంగా బడ్జెట్ల క్రమంలో లబ్ధి పొందింది – ఒక వైపున అంతర్జాతీయ (కొంతమేరకు దేశీయ) ఫైనాన్స్‌ పెట్టుబడిదారులు, మరోవైపున కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే. ఈ రెండు తరహాల వారికీ మేలు చేసేందుకే – ప్రతీ బడ్జెట్‌లోనూ ద్రవ్యలోటును తగ్గించటం... అలాగే కార్పొరేట్లకు అనేకానేక రాయితీల వంటివి నిండుగా ఉంటాయి. ద్రవ్యలోటును ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర బిందువుగా చేయటం ఎందుకోసం? సుమారుగా నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1980ల ముందర – ఈ ద్రవ్యలోటు అంశానికి అటు బడ్జెట్లలోనూ, ఇటు ఆర్థిక వ్యవహారాలలోనూ ప్రాధాన్యత లేదు. నాడు ప్రపంచంలోని మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలోనూ – ‘కీన్స్‌’ సిద్ధాంతాల ప్రాతిపదికన నడిచిన సంక్షేమ రాజ్యానిదే పెద్దపేట. నాడు ప్రభుత్వాల ప్రధాన బాధ్యత– దేశంలోని ప్రజల బాగోగులు కోరి... అలాగే కార్పొ రేట్ల మనుగడకు కూడా అనుకూలమైన విధంగా – జన సామాన్యం తాలూకూ కొనుగోలు శక్తిని... అంటే మార్కెట్లో సరుకులు, సేవలకు డిమాండును కాపాడటం. ఈ పరిస్థితి 1980ల అనంతరం మారి పోయింది. సరుకులు, సేవలను ఉత్పత్తి చేసి లాభాలను పొందే కార్పొరేట్‌ సంస్థల ప్రాధాన్యత తగ్గి... గతంలో ఈ కార్పొరేట్‌ సంస్థల స్థాపనకూ, లేదా వాటి కార్యకలాపాల నిర్వహణకూ పెట్టుబడులను సరఫరా చేసే ఫైనాన్స్‌ పెట్టుబడులది పై చేయి అయ్యింది. అప్పటి వరకూ పారిశ్రామిక వ్యవస్థకు కేవలం వెన్నుదన్నుగా మాత్రమే ఉన్న ఫైనాన్స్‌ పెట్టుబడులు పూర్తిస్థాయిలో స్వతంత్రంగానూ... మరో మాటలో చెప్పాలంటే, ఉత్పాదక, పారిశ్రామిక పెట్టుబడుల కంటే శక్తి మంతంగానూ తయారయ్యాయి. ఈ క్రమంలోనే – షేర్‌ మార్కెట్లు, ఫైనాన్స్‌ వ్యాపారాలు (ప్రస్తుతం ‘వెంచర్‌ క్యాపిటల్‌’ అని పిలిచే వాటితో సహా), రియల్‌ ఎస్టేట్‌ వంటి స్పెక్యులేటివ్‌ పెట్టుబడులది పై చేయి అయ్యింది. ఈ తరహా పెట్టుబడుల అవసరాల కోసంముందుకు వచ్చిందే ‘ద్రవ్యలోటు’ ఉండరాదు అనే సూత్రీకరణ. దీనిలో భాగంగానే ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట స్థాయిలో అదుపులో ఉంచటం గురుతర బాధ్యత అయింది.

ద్రవ్యలోటు అధికంగా ఉండటమంటే, ప్రభుత్వం తాలూకూ ఖర్చులు దాని ఆదాయం కంటే అధికంగా ఉండటం అని. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ అదనపు ఖర్చుకు అవసరమైన డబ్బును ప్రభుత్వం ముద్రించవలసి రావచ్చు లేదా అప్పుగా తెచ్చుకోవాల్సి రావచ్చు. దీని వలన వాస్తవ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీ పెరిగి– ద్రవ్యోల్బణం పెరుగుతుందనేది లెక్క. ద్రవ్యో ల్బణం పెరగటమంటే... అనివార్యంగా ఆ దేశం తాలూకూ కరెన్సీ విలువ తగ్గుదలే. ఈ కరెన్సీ విలువ తగ్గుదల ఆ దేశీయ షేర్‌ మార్కెట్లలో లేదా ఇతరత్రా స్పెక్యులేటివ్‌ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినవారి లాభాల తాలూకు నికర విలువ తగ్గుదలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్స్‌ పెట్టుబడిదారులు – మన కరెన్సీ విలువ తగ్గ రాదని కోరుకుంటారు. ఇది వారి లాభాలను కాపాడుకోవటం కోసం. దీని కోసం వారు మన ప్రభుత్వం ప్రజల అవసరార్థం వ్యయాలను పెంచుకోవడాన్ని అంగీకరించలేరు. కాబట్టి ఈ ద్రవ్యలోటు సిద్ధాంతకర్తలు – వివిధ దేశాల ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ, సాధ్యమైనంతగా ప్రజలకు లభించే సంక్షేమ పథకాలపై కోతలు పెట్టాలనీ కోరుకుంటారు.

ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత మన పాలకులు కూడా ఈ ద్రవ్యలోటును లక్ష్మణరేఖగా ఆమోదించుకొని, దానికి లోబడే తమ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం పెరగటం వంటి ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పనా కార్యక్రమాలపై పెట్టే ఖర్చులను ఇంకా తగ్గిస్తూనే పోతోంది. దీనిలో భాగంగానే నేడు ఆర్థిక మాంద్యం లేదా మందగమన పరిస్థితులు ఉన్నా – ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం చివరికి 5.9 శాతానికి తగ్గించటంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎరువుల సబ్సి డీలపై వేటు, ఆహార సబ్సిడీల కుదింపు వంటివి ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ సబ్సిడీలకు పాలకులు ఇప్పటికే మంగళ హారతి పాడేశారు.

ఇక తరువాతిది కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వటం. ఇది గత 8 సంవత్సరాల బీజేపీ హయాంలో మరింత నిర్మొహమాటంగా వేగం పుంజుకుంది. 2019లో కార్పొరేట్‌ ట్యాక్సును భారీగా 10 శాతం మేర తగ్గించేశారు. దీని వలన ప్రభు త్వానికి సాలీనా 1.45 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అలాగే, కార్మిక సంస్కరణల పేరిట – ఉద్యోగులు, కార్మికులు, గిగ్‌ వర్కర్ల వంటివారిని పిండి పిప్పిచేసి తమ లాభాలను పెంచుకొనేందుకు కార్పొరేట్లకు మరిన్ని దారులను తెరుస్తున్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ పేరిట – ఉత్పత్తిని తగిన మేరకు పెంచిన కార్పొరేట్లకు రాయితీల పేరు చెప్పి  లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారు. ఇంత చేసినా వాస్తవంలో ఈ కార్పొరేట్ల నుంచి – ఇటు కొత్త పెట్టుబడుల రూపంలో గానీ, అటు అదనపు ఉపాధి కల్పన రూపంలో గానీ ఫలితం ఏమీ దక్కడం లేదు. వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ప్రజల చేతిలో డబ్బు లేదనీ లేదా వారికి కొనుగోలు శక్తి లేదనే విషయాన్ని విస్మరిస్తూ... బడ్జెట్‌ తర్వాత బడ్జెట్‌ను మూస తరహాలో వేస్తూనే పోతోంది ప్రభుత్వం. హరిత ఇంధనానికి ప్రోత్సాహం, మౌలిక వనరులకు ఊతం వంటి పేర్లేవి చెప్పినా... అదంతా అంతిమంగా కార్పొరేట్లకు రాయితీలు, కానుకలుగా మాత్రమే ఉండిపోగలదు.

స్థూలంగా కాకులను కొట్టి గద్దలకు వేసే సరళిలో సాగుతోన్న ప్రభుత్వ విధానాలు రానున్న ఎన్నికల నేపథ్యంలో కాస్తంత కరుకుదనాన్ని తగ్గించుకున్నా – అవి పెద్దగా మారి ప్రజానుకూలంగా సంపదను పంపిణీ చేసే సాహసానికి దిగలేవు. సంవత్సరానికి ఒక రోజు ముందుకు వచ్చే ఈ బడ్జెట్‌ రోజునైనా లేకుంటే మిగతా 364 రోజులైనా జరుగుతోంది ఒకటే... అది జనం మీద భారాలు... కార్పొరేట్లు, ధనవంతులకు నజరానాలు! కాదూ కూడదంటే ఈ దేశంలోని కూలీ జనం కులీనులూ లేదా పన్ను చెల్లింపుదారుల పైసలను ‘ఉచితాలుగా’ దిగమింగేస్తున్నారంటూ ఎదురుదాడులు! ధనికుల, ధనస్వామ్య ఆరాధనలో... వినిమయ సమాజపు వస్తు వ్యామోహంలో పడి వాస్తవాలను చూడలేని దుఃస్థితిలో జన సామాన్యం కొనసాగినంత కాలం ఈ దగాకూ, దాని మనుగడకూ ఢోకా లేదు.


డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్‌: 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement