రాయని డైరీ.. గులామ్‌ నబీ ఆజాద్‌ (కాంగ్రెస్‌)

Madhav Singaraju Rayani Dairy On Gulam Nabi Azad - Sakshi

మాధవ్‌ శింగరాజు

సంజయ్‌గాంధీ ఉన్నప్పట్నుంచీ గాంధీల కుటుంబంతో నాకు అనుబంధం. పేరుకు నేను ఆజాద్‌నే గానీ, నేనూ ఒక గాంధీనే అన్నట్లు నాకై నాకు తరచు ఒక అనుభూతి వంటిది కలుగుతుంటుంది. గులామ్‌ నబీ గాంధీ! 
కాంగ్రెస్‌లో నాలా డెబ్బై నిండిన కాంగ్రెస్‌ గాంధీలు ఎంతమంది ఉన్నారో చేతి వేళ్ల మీద లెక్కించి చెప్పడం కష్టమైన సంగతే. కౌంట్‌కి పక్కవారి చేతి వేళ్లు కూడా అవసరం అవుతాయి. ఆ వేళ్లలో ఎవర్ని కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ని చేసినా వాళ్లూ గాంధీలే. గాంధీలను దాటి, గాంధీలను దాచి కాంగ్రెస్‌ ఎటూ వెళ్లిపోలేదు. 
సీడబ్ల్యూసీ సమావేశం అయ్యాక ఇంటికి వచ్చేస్తుంటే దారి మధ్యలో ఒవైసీ ఫోన్‌ చేశాడు! ‘‘భాయ్‌జాన్‌.. మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి..’’ అన్నాడు.
‘‘అససుద్దీన్‌.. దయచేసి మరింకెప్పుడైనా చేయగలవా?’’ అన్నాను. అతడేవో పుల్లలు సిద్ధం చేసుకుని ఉంటాడు. వాటినిప్పుడు నా చెవుల్లో విరుస్తూ కూర్చుంటాడు. 
‘‘సమావేశంలో అలసిపోయి ఉంటారేమో కదా. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవలసినంతగా మీరు మీ సమావేశంలో పాల్పంచుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. లేదా మీరు మీ అలసట సమయాన్ని రాహుల్‌ గాంధీకి సంజాయిషీ చెప్పుకోడానికి వినియోగించాలని తొందరపడుతూ ఉండి ఉండొచ్చు. సరే భాయ్‌జాన్‌ మరి. ఫోన్‌ కాకుండా ట్వీట్‌ చేస్తాను’’ అన్నాడు!!
సీడబ్ల్యూసీ సమావేశాలను ఫాలో అవడం తప్ప హైదరాబాద్‌లో పెద్దగా పనులేమీ లేనట్లున్నాయి ఒవైసీకి. 
‘‘పార్టీ అధినేతకు సంజాయిషీ ఇచ్చుకునే సంప్రదాయానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడే ఉంటారు ఒవైసీ. తగ్గించుకొనువారు కాంగ్రెస్‌లో హెచ్చింపబడతారు’’ అన్నాను. 
ఈమాటైతే నిజం. కాంగ్రెస్‌లో హెచ్చింపబడినవారు సాయంత్రానికో, ఆ మర్నాటికో తగ్గించబడరన్న భరోసా అయితే  లేదు కానీ.. తగ్గించుకున్నవారు ఓ యాభై ఏళ్లకైనా హెచ్చింపబడతారు. హెచ్చింపబడేందుకు నేనిప్పుడు నా తగ్గింపు యాభైల దగ్గర ఉన్నాను. 
కారు దిగుతుండగా ఒవైసీ ట్వీట్‌! ‘పొయెటిక్‌ జస్టిస్‌’ అని పెట్టాడు! చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అట!
ఇంట్లోకి రాగానే రాహుల్‌ బాబుకి ఫోన్‌ చేశాను. ‘దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది..’ అని వచ్చాక, కాసేపు రింగ్‌ అయి నాట్‌  ఆన్సరింగ్‌ అని వచ్చింది. పార్టీకి ఎన్నికలు జరిపించాలని సోనియాజీకి లెటర్‌ పెట్టడం రాహుల్‌బాబుకు బాగా కోపం తెప్పించిందని సీడబ్ల్యూసీ సమావేశంలో అతడు నన్ను తీక్షణంగా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది.
రాహుల్‌బాబు ఎవర్నైనా తీక్షణంగా చూస్తున్నాడంటే తనింకా పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాడనే! అది నాకు సంతోషం అనిపించింది. మమ్మీకి బాగోలేక హాస్పిటల్‌లో ఉంటే మీరంతా పార్టీకి కొత్త ప్రెసిడెంట్‌ కావాలని లెటర్‌ రాసి సంతకాలు పెడతారా.. అని సమావేశంలో పెద్దగా అరిచేశాడు. 
‘పార్టీకి బాగోలేక మమ్మీకి రాసిన లెటరే కానీ, మమ్మీకి బాగోలేనప్పుడు చూసి పార్టీకి రాసిన లెటర్‌ కాదు రాహుల్‌ బాబూ..’ అని చెప్పడానికే రాహుల్‌కి ఫోన్‌ చేస్తుంటే ఎత్తడం లేదు. 
నడుము వాలుస్తుండగా ఫోన్‌ రింగ్‌ అయింది. రాహుల్‌బాబు!
‘‘రాహుల్‌ బాబూ.. నువ్వింకా మేల్కొనే ఉన్నావా!’’ అన్నాను ఎగ్జయిటింగ్‌గా. 
‘‘రాహుల్‌ బాబు కాదు గులామ్‌జీ. పార్టీని చార్జింగ్‌కి పెట్టి రాహుల్‌బాబు నిద్రపోతున్నాడు’’ అన్నారు సోనియాజీ. 
ఫోన్‌ని చార్జింగ్‌కి పెట్టి అనబోయి, పార్టీని చార్జింగ్‌కి పెట్టి.. అన్నట్లున్నారు సోనియాజీ.
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top