విశాఖపై ఇంత దుష్ప్రచారమా?

Kommineni Srinivasa Rao Article On Executive Capital Visakhapatnam - Sakshi

విశ్లేషణ

రాబోయే ఎనభై ఏళ్ల కాలంలో విశాఖతోపాటు 12 నగరాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువస్తుందని నాసా నివేదిక హెచ్చరించిందన్న వార్త పట్టుకుని ఒక వర్గం మీడియా టీవీల్లోనూ, పత్రికల్లోనూ చేసిన విపరీత ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ ప్రచారాన్ని చూస్తే అదేదో విశాఖపట్నం భవిష్యత్తులో మునిగిపోతుందేమోనన్న భయం కలుగుతుంది. ఒక ప్రముఖ పరిశ్రమ వెలువరించే కాలుష్యాన్ని సమర్థిస్తూ ఇదే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. విశాఖకు వచ్చేసరికి మాత్రం లేనిపోని భయాలను పెంచాలని చేసిన ప్రయత్నంగా తెలిసిపోతుంది. విశాఖలో 2100 నాటికి సముద్రం 1.77 అడుగుల మేర పెరగవచ్చన్నది అంచనా. ఇదే కొంత ప్రమాదం అనుకుంటే ఈ ఎనభై ఏళ్లలో ప్రభుత్వాలు దానికి ప్రత్యామ్నాయాలు చేయలేవా?

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు ముప్పు.. సముద్రంలో మునిగిపోయే నగరాల జాబితాలో విశాఖ కూడా ఉంది.. ఇది ఒక మీడియా చేసిన విపరీత ప్రచారం. తద్వారా విశాఖపట్నంపై వారికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. మళ్లీ అదే మీడియా మరో లైన్‌లో నగరంలో ఎత్తులో ఉన్న ప్రాంతాలు ముంపునకు గురికాకున్నా, చుట్టూ నీరు చేరడం వల్ల తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. 2100 సంవత్సరం నాటికి విశాఖతో పాటు పన్నెండు నగరాలలోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తుందని నాసా నివేదిక హెచ్చరిక.. ఇలా సాగిన ఆ మీడియా కథనం టీవీలో విన్నా, పత్రికలో చదివినా, అదేదో విశాఖపట్నం భవిష్యత్తులో మునిగిపోతుందేమోనన్న భయం కలుగుతుంది. ఆ వార్తను పూర్తిగా చదివితే అసలు విషయం బోధపడుతుంది. విశాఖకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఇట్టే అర్థం అయిపోతుంది. కావాలని ఆ మీడియా ఈ దిక్కుమాలిన ప్రచారం చేస్తోందని తెలుసుకోవడం కష్టం కాదు. మరి అదే మీడియా ఒక ప్రముఖ పరిశ్రమ వెలువరించే కాలుష్యాన్ని సమర్థిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. విశాఖకు వచ్చేసరికి మాత్రం లేనిపోని భయాలను పెంచాలని చేసిన ప్రయత్నంగా తెలిసిపోతుంది. 

ప్రపంచవ్యాప్తంగా హిమపర్వతాలు పెరగడం, నదుల నీరు సముద్రంలో కలవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల సముద్ర నీటిమట్టాలు మిల్లీమీటర్ల స్థాయిలో పెరుగుతాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఎక్కడెక్కడ సముద్రం పెరిగే అవకాశం ఉందో చెప్పడం కూడా మంచిదే. నిజంగానే అది ప్రమాదకర స్థాయిలో ఉంటే హెచ్చరించడం కూడా పద్ధతే. కానీ ఉన్నవీ, లేనివీ రాసి, నగరాలు సముద్రంలో మునిగిపోతాయని, గతంలో ఇలాగే జరిగిందని అంటూ అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడం మాత్రం ప్రజలకు తీరని ద్రోహం చేయడమే. ఇంతకీ చూస్తే దేశంలో ముంబై, చెన్నై, మంగళూరు తదితర తీరప్రాంత నగరాలు వచ్చే ఎనభై ఏళ్ల నాటికి పెరిగే నీటిమట్టం ఎక్కడా రెండు అడుగులు కూడా లేదు. అలాంటప్పుడు నగరాలు ఎలా మునకకు గురి అవుతున్నాయన్నది వివరించాలి కదా? 

విశాఖ నగరాన్నే తీసుకుందాం. విశాఖ సముద్రానికి అధిక ప్రాంతం కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. అక్కడ జనావాసాలు అధికంగానే ఉన్నాయి. విశాఖలో ఏ పాయింట్‌లో తీసుకున్నా ఇరవై అడుగుల నుంచి నలభై అడుగుల ఎత్తున జనావాసాలు ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకుని వార్తలు రాయాలి కదా. విశాఖలో 2100 నాటికి సముద్రం 1.77 అడుగుల మేర పెరగవచ్చన్నది అంచనా. ఇది కూడా కొంత ప్రమాదం అనుకుంటే ఈ ఎనభై ఏళ్లలో ప్రభుత్వాలు దానికి ప్రత్యామ్నాయాలు చేయలేవా? ఏపీనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా? అమెరికా వంటి దేశాలలో కూడా ఇలాగే నగరాలు మునిగిపోతుంటే ఏమి చేయలేరా? అన్నది ఆలోచించాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఇప్పటికే పెరిగింది. చంద్రమండలంలో నివసించవచ్చా అన్నదానిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి దశలో ఈ చిన్న సమస్య అంత పెద్ద ప్రమాదం అవుతుందా? 

గతంలో 1977లో ఏపీలో దివిసీమ ప్రాంతంలో ఉప్పెన వచ్చి పదివేల మంది వరకు మృత్యువాత పడ్డారు. అప్పట్లో దానిని సరిగా ఊహించలేకపోవడం, తెల్లవారుజామున సంభవించడం వంటి కారణాల వల్ల అంత ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాయి. అప్పుడు  దివిసీమను వదలి జనం వెళ్లిపోలేదు. వ్యవసాయంతో సహా ఎవరి వృత్తులు వారు నిర్వహించుకుంటున్నారు. ఇటీవలికాలంలో తుపానులు వస్తున్నాయంటే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలను లక్షల సంఖ్యలో  సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కమ్యూనిటీ కేంద్రాలను ఎన్నిటినో నిర్మించారు. ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ దళాలను ఏర్పాటు చేశారు. అయినా కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలకు కొంత నష్టం జరగవచ్చు. కాదనం. అది ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. కొద్ది సంవత్సరాల క్రితం జపాన్‌తో సహా పలుదేశాలలో సునామీ సంభవిం చింది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నష్టం జరిగింది. 

మన దేశంలోనూ, ఏపీలోనూ సునామీ ప్రభావం చూపడం జరి గింది. అండమాన్‌ వంటి ప్రాంతాలలో తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా అండమాన్‌ కోలుకుని యథావిధిగా జీవనం సాగిస్తోంది. ఇదంతా అనుభవం. సముద్రాలతోనే కాదు.. నదులతో కూడా అనేకసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. గంగానది పొంగని ఏడాది ఉండదు. పట్నాతో సహా అనేక నగరాలు చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ ఏడాది వారణాసి సైతం వరద ముంపున పడింది. అందువల్ల నగరాలను ఖాళీ చేస్తున్నారా? ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో కొండ చరియలు విరిగి పడడం నిత్యకృత్యం. ఉత్తరాఖండ్‌లో ఇళ్లకు, ఇళ్లు కొట్టుకుపోయిన ఘట్టాలు జరిగాయి. భూకంపం వచ్చి ఆ రాష్ట్రం అతలాకుతలం అయింది. దేశ రాజధాని ఢిల్లీ సైతం భూ ప్రకంపనలకు గురైంది. తాజాగా సిమ్లా హైవేలో కొండచరియ విరిగిపడ్డ  ప్రమాదంలో పదిహేను మంది వరకు మరణించారు. అయినా అక్కడి ప్రజలు కొండలు వదలి వెళ్లిపోవడం లేదు. 

ఇక ఏపీకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతం నిర్మాణాలకు అనువు కాదని నిపుణులు చెప్పారు. అయినా గత ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో బాగా లోతుగా పునాదులు తీస్తోందని ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది. కొండవీటి వాగు వంటి వాటి వల్ల వరదలు వస్తుంటాయి. ఆ వరద నీటిని తోడడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి ఏకంగా ఒక లిప్ట్‌ స్కీమునే గత ప్రభుత్వం చేసింది కదా. కృష్ణా నది వరద పెద్ద ఎత్తున వస్తే కట్ట మీద ఉన్న ఇళ్లలోకి నీళ్లు వస్తాయని అందరికీ తెలుసు. అయినా అక్కడ భారీ విలాసవంతమైన భవనాలు వచ్చాయి. అలాంటి ఒక భవనంలోనే గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నివసిస్తుంటారే. మరి అది ప్రమాదకరం కాదా? అది నదీ జలాల పరిరక్షణ చట్టాలకు విరుద్ధం కాదా? కానీ ఇదే మీడియా అమ్మో.. చంద్రబాబు ఇంటిని వరద నీటితో ముంచుతున్నారంటూ ప్రచారం చేసింది. 

అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇన్‌ సైడింగ్‌ ట్రేడింగ్‌ ద్వారా భూములు కొన్న ఒక వర్గం వారు విశాఖపట్నానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. విశాఖపట్నం కన్నా తక్కువ మట్టంలో ఉన్న నగరాలు, పట్టణాలు అనేకం ఉన్నాయి. అయినా వాటికి ఏదో అయిపోతుందని చెప్పజాలం. ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా కథనాలు ఇవ్వడం వేరు. కావాలని భయపెట్టే రీతిలో వార్తలు ఇవ్వడం వేరు. ఒకప్పుడు ఆకాశం నుంచి స్కైలాబ్‌ పడుతుందని ప్రచారం జరిగింది. దాంతో అనేకమంది ఇక యుగాంతం అయిపోతుందేమోనని కంగారుపడినవారు కూడా ఉన్నారు. ఇష్టంవచ్చినట్లు ఖర్చు చేసిన అమాయకులు ఉన్నారు. తీరా ఆ స్కైలాబ్‌ ఆస్ట్రేలియాలో మారుమూల ప్రాంతంలో కూలిపోయింది. పెద్ద నష్టం కూడా సంభవించలేదు. ఆ రోజులలో ఇంత సమాచార వ్యవస్థ లేదు. సాంకేతిక పరి జ్ఞానం అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మీడియా అనండి, సోషల్‌ మీడియా అనండి..క్షణాలలో అందరికీ తెలిసిపోతుంది. కనుక ఎవరూ భయపడే పరిస్థితి లేదు.  అందువల్ల విశాఖ ప్రాంతంలో సముద్రంలో భూకంపాలు వస్తాయని ఒక మీడియా, విశాఖ మునిగిపోతుందని మరో మీడియా వార్తలు ఇచ్చినా ప్రజలు ఎవరూ భయపడనవసరం లేదు. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతో ఇలాంటి కథనాలు ప్రచారం చేయడంవల్ల ఆ మీడియాకే అంతిమంగా నష్టం జరుగుతుంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top