ఆలస్యమే! అయినా అభిలషణీయమే!

CPM Elects Dalit Leader to Politburo First Time: Sayantan Ghosh Opinion - Sakshi

సీపీఎం తన అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్‌ బ్యూరోలోకి ఎట్టకేలకు ఒక దళితుడిని చేర్చుకుంది. ఒక దళిత నాయకుడికి ఆ స్థానం కట్టబెట్టడానికి భారతదేశంలోని అతిపెద్ద వామపక్ష రాజకీయ పార్టీకి 57 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. బెంగాల్‌ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రామచంద్ర డోమ్‌ను సీపీఎం ఇటీవలే నిర్వహించిన  పార్టీ జాతీయ మహాసభలలో పొలిట్‌ బ్యూరోలోకి తీసుకుంది. ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే ఒక దళిత నాయకుడిని పొలిట్‌ బ్యూరోలోకి తీసుకున్నంత మాత్రాన పెద్ద మార్పు జరిగిపోదని గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో వామపక్షం కులవివక్షపై నేటికీ స్పష్టమైన వైఖరిని కలిగిలేదు.

వామపక్ష పార్టీలు వర్గ వివక్షను అర్థం చేసుకున్నాయి కానీ కులాన్ని కాదు. ‘ఒక కమ్యూనిస్టుగా పొలిట్‌ బ్యూరోలో స్థానం సంపాదించుకున్న మొట్ట మొదటి దళితుడిగా నాకు నేనుగా భావించలేను. మరే విషయంలోనైనా సరే అలాంటి ఆలోచనలు నాకు ఉండవు’ అని రామచంద్ర డోమ్‌ మీడియాతో చెప్పారు. భారతీయ నేపథ్యంలో ఈ ప్రకటన కూడా సమస్యాత్మకమే. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు సుదీర్ఘ కాలం పాలించినా కానీ దళితులకు లేదా ఆదివాసీలకు కీలకమైన నాయకత్వ స్థానాల్లో చోటు కల్పించలేక పోయారు. జ్యోతిబసు, బుద్ధదేవ్‌ భట్టాచార్య, సీతారామ్‌ ఏచూరి, మాణిక్‌ సర్కార్‌ తదితర సీపీఎం అగ్ర నేతలు అందరూ అగ్రకుల నేపథ్యాల నుంచి వచ్చారు. 

వామపక్షంలో బయటకు కన్పించని, లేదా మాట్లాడని కులపక్షపాతం చాలా ప్రమాదకరమైనది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోవడం వెనుక ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో దళిత ఓట్లు గతంలో కమ్యూనిస్టు పార్టీకే పడేవి కానీ తర్వాత వాటిని తృణమూల్‌ కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. ఇప్పుడు దళితుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. బెంగాల్‌లో మాదిరి త్రిపురను కూడా సీపీఎం 25 ఏళ్లు పాలించింది. కానీ ఈరోజు ఆ రాష్ట్రాన్ని కూడా బీజేపీ స్వాధీనపర్చుకుంది. రాష్ట్రంలోని ఆదివాసీ రాజకీయాలను గుర్తించడంలో కమ్యూనిస్టుల వైఫల్యమే ఈ పతనానికి కారణం. కేంద్రీకృత నిర్ణయాలు అందరికీ సమానంగా వర్తించాలని సీపీఎం నమ్ముతుంది కానీ గిరిజనులకు అవసరమైన రాజకీయ ఆవరణను వీరు అనుమతించలేక పోయారు. ఈ రాజకీయ శూన్యతలోకి ఆరెస్సెస్‌ అడుగుపెట్టి గిరిజనులకు ఒక వేదికను కల్పించింది. క్రమంగా త్రిపురలో గిరిజనుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. చివరకు ఆ పార్టీ గెలుపు సాధించింది కూడా!

2018లో తెలంగాణలో దళిత రాజకీయ పార్టీలతో సీపీఎం చేతులు కలిపి బహుజన వామపక్ష ఐక్య సంఘటనను ఏర్పర్చింది. తెలంగాణలో సీపీఎం నాయకత్వం జై భీమ్‌ – లాల్‌ సలాం అనే నినాదాన్ని కూడా చేపట్టింది. అంబేడ్కర్ని కమ్యూనిస్టులు తమ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా గుర్తించిన సమయమిది. అయితే ఈ ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలాగే ఉండిపోయింది తప్పితే దళితులకు, గిరిజనులకు వారి పొలిట్‌ బ్యూరోలో ఎన్నడూ స్థానం కల్పించలేదు. పైగా దళిత రాజకీయాలను గుర్తింపు రాజకీయాలుగా మాత్రమే వామపక్షం పిలుస్తూ వచ్చింది. అంబేడ్కర్‌ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకాన్ని వామపక్షం ఎన్నడూ అంగీకరించలేదు. తమ పొలిట్‌ బ్యూరోలోకి మొట్టమొదటి దళిత నేతను చేర్చుకోవడాన్ని వ్యూహాత్మక అడుగుగా వామపక్షం ఎన్నటికీ ఆమోదించదు. అయినప్పటికీ ఇది వాస్తవం. తమ రాజకీయ అవకాశాలు ఎన్నడూ లేనంతగా కుదించుకు పోతున్నాయని వామపక్షం కొన్ని సంవత్సరాలుగా గుర్తిస్తూ వస్తోంది. (క్లిక్‌: మలి అంబేడ్కరిజమే మేలు!)

త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో వామపక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సంస్థలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కింది స్థాయిలో సంస్థను బలోపేతం చేసుకోవడానికి ఏకైక మార్గం మరింతగా ప్రజారాశులను చేర్చుకోవడమే అని వామపక్ష నాయకత్వం గుర్తించింది. 57 సంవత్సరాల తర్వాత పార్టీ నిర్ణాయక అంగమైన పొలిట్‌ బ్యూరోలో దళిత, గిరిజన నేతలను చేర్చుకోవడం అనేది సంస్థాగత మార్పులను తీసుకొస్తుందని వామపక్షం గుర్తించింది. (క్లిక్‌: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్‌ వ్యతిరేకత)

భారతదేశంలో వామపక్ష పునరుద్ధరణ సాధ్యపడుతుందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. కానీ కుల వివక్ష, మైనారిటీల పట్ల వివక్ష ఉందన్న వాస్తవాన్ని ఆమోదించకుండా, వారి స్వరాలకు చోటు కల్పించకుండా వామపక్ష పునరుద్ధరణ అసంభవం. సాంప్రదాయికంగా తాము విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ పార్టీల నుంచి ముస్లింలు కూడా బయటపడుతూ తృణమూల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ వంటి కొత్త పార్టీలకు లేదా ఏఐఎంఐఎం వంటి పార్టీలకు ఓటు వేస్తున్నారు. భారతీయ కులాధిక్యతా సమాజంలో మార్క్సి జాన్ని తప్పుగా అన్వయించడం వల్లే వామపక్షం తనదైన చోటును కోల్పోయింది. తన పొలిట్‌ బ్యూరోలోకి తొలి దళితుడిని సీపీఎం చేర్చుకోవడం అనేది రాబోయే రోజుల్లో నిజమైన మార్పును తీసుకొస్తుంది. భారత రాజకీయాల్లో తమ పునరుద్ధరణకు తొలి అడుగుగా వామపక్షం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది.

- సాయంతన్‌ ఘోష్‌ 
వ్యాసకర్త స్వతంత్ర జర్నలిస్టు, కోల్‌కతా
(‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top