అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్‌ వ్యతిరేకత

Kanche Illiyah Review English Language In Educational Institutions - Sakshi

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లాడాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అన్నారు. కానీ ఇంగ్లిష్‌ రాజ్యమేలుతున్న ప్రైవేట్‌ రంగాన్ని ఆయన సౌకర్యవంతంగా విస్మరించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని అడ్డుకుంటే, దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. హిందీని అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు... ఇంగ్లిష్‌ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ జాబ్‌ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా వారిలో తుంచేయాలని చూస్తే ఎలా? ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా నిలిచిందంటే... భారత్‌ మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళుతుంది.

ఒకే దేశం, ఒకే భాష అని ప్రబోధిస్తున్న ఆరెస్సెస్, బీజేపీల ఎజెండా మళ్లీ ముందు కొచ్చింది. హిందీని జాతీయ, అధికారిక భాషగా ఆమోదించాలంటూ దక్షిణ భారతదేశంపై, ఈశాన్య భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వ పథకం కూడా ముందుకొచ్చింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవలి ప్రకటన చూస్తే మరింత సీరియస్‌ అంశాన్ని అది సూచిస్తోంది.

అధికార భాషా కమిటీ చైర్మన్‌ హోదాలో కేంద్ర హోంమంత్రి 2022 ఏప్రిల్‌ 7న ఒక డేరింగ్‌ ప్రకటన చేశారు. ‘దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో మాట్లా డాలి’ అనేశారాయన. గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ఇంగ్లిష్‌ని ప్రధానమైన భావవ్యక్తీకరణ భాషగా కలిగి ఉంటున్న ప్రైవేట్‌ రంగాన్ని ఆయన పూర్తిగా విస్మరించేశారు. అమిత్‌ షా ప్రకటనకు సరిగ్గా ఒకరోజు ముందు, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్‌పర్సన్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లు నెలకొల్పు కోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ క్యాంపస్‌లలోని విద్యార్థులు, టీచర్లు హిందీ మాట్లాడతారా? ‘అశోకా’ లేదా ‘ఎమిటీ’ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌కి బదులుగా హిందీలో బోధించాలని అమిత్‌ షా కోరగలరా? ఒకటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రి జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలను హిందీ మీడియం విద్యాసంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. 

భారతదేశ భాషా బాహుళ్యవాదం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి ముందు, ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ని వ్యతిరేకించడం ద్వారా దేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీ కమ్యూనిటీలు ఎదుర్కొనే పర్యవసానాలను చూడటం ముఖ్యం. ప్రభుత్వ రంగం లోని  పరిశ్ర మలను, విద్యాసంస్థలను ప్రైవేటీకరించాలని బలంగా ప్రభోధిస్తున్న వారిలో అమిత్‌ షా ఒకరు. అయితే దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్‌ రంగ విద్యాసంస్థలూ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్ని, కళాశాలలనే నడుపుతున్నాయన్న విషయాన్ని అమిత్‌ షా విస్మరిస్తున్నారు. హిందీని బోధనా భాషగా, అధికార భాషగా అమలు చేయాలనుకున్నప్పుడు ఇంగ్లిష్‌ స్కూళ్లు, కాలేజీలను ఏం చేస్తారు? భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ రాబడిని తెచ్చిపెడుతున్న ప్రధాన వనరు అయిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో హిందీని అమలు చేయడానికి అమిత్‌ షా ప్లాన్‌ ఏమిటి? 

దక్షిణ భారత, ఈశాన్య భారత రాష్ట్రాలను హిందీ మాట్లాడాలని నిర్బంధిస్తే, వాటి భాషలు, వాటి వ్యక్తీకరణ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి. హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఇదే మొదటిసారి కాదు. అంతర్గతంగా, బాహ్యాంగా ఆర్థిక సంబంధాలలో ఇంగ్లిష్‌ ఒకే విధమైన స్థాయిని పొందని కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇలాగే దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. తమిళనాడు ప్రథమ ముఖ్యమంత్రిగా సి.రాజగోపాలాచారి పాలిస్తున్నప్పుడు 1937–1940 మధ్యకాలంలో రాష్ట్ర జనాభాపై హిందీని రుద్దాలని ప్రయత్నించారు. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ శిబిరంలో రాజ గోపాలాచారి ఒక మెతకస్వభావం కలిగిన హిందుత్వ వాదిగా ఉండే వారు. హిందీపై ఆయన వైఖరి కాంగ్రెస్‌లోని బ్రాహ్మణ సిద్ధాంత కర్తలను విభజించి వేసింది. ఉదాహరణకు టి.టి. కృష్ణమాచారి పక్కా హిందీ వ్యతిరేకిగా, ఇంగ్లిష్‌ సమర్థకుడైన నేతగా ఉండేవారు. 

అయితే తమిళనాడుపై హిందీని నిర్బంధంగా రుద్దడానికి వ్యతిరేకంగా శూద్ర, దళిత ప్రజానీకాన్ని కూడగట్టిన ఘనత పెరియార్‌ రామస్వామి నాయకర్‌కే దక్కాలి. 1965లో లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వం చేసిన హిందీని రుద్దాలనే ప్రయత్నం తమిళనాడులో భారీ స్థాయి ఆందోళనలకు, కాల్పులకు దారితీయడమే కాదు... చాలా మంది ఆత్మాహుతికి కూడా కారణమైంది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక పోరాటంలో 70 మంది ప్రజలు చనిపోయారు. ఫలితంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పొందింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత అన్నాదురై తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చరిత్ర తెలిసిందే.

అయితే తమిళ ప్రజల ఇంగ్లిష్‌ అనుకూల ఆందోళనల వల్ల ఎవరు లబ్ధి పొందారు అంటే తమిళ బ్రాహ్మణులే. వీరు చాలావరకు ప్రైవేట్‌ క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. బ్రాహ్మ ణిజంపై తిరుగుబాటు చేసిన తమిళ బ్రాహ్మణ మహిళ గీతా రామ స్వామి... ఇటీవల రాసిన తన జ్ఞాపకాల్లో (ల్యాండ్, గన్స్, క్యాస్ట్, విమెన్‌) ఇంట్లోనూ, తాను చదువుకున్న ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల లోనూ పరస్పర వ్యతిరేకమైన విశ్వాసాల మధ్య తన బాల్యం గడిచి పోయిందని చెప్పారు. ఇంట్లో బ్రాహ్మిన్‌గానూ, పాఠశాలలో కేథలిక్‌ గానూ తాను గడిపానని ఆమె చెప్పారు.

రుతుస్రావం అనేది భయంకరమైన కాలుష్యమని, రజస్వలగా ఉన్నప్పుడు దేవతా విగ్రహాలను తాకితే అవి మైలపడిపోతాయనీ, విరిగిపోతాయనీ బ్రాహ్మణ భావజాలంతో కూడిన ఇల్లు ఆమెకు నేర్పింది. కానీ ఆమె చదివిన పాఠశాల మాత్రం రుతుస్రావం అంటే తనలోని సంతాన శక్తిని చాటే ప్రక్రియ అని ఆమెకు బోధించింది. ఈ విధంగా సమాజంలోని అన్ని ఇతర కులాల వారికంటే బ్రాహ్మణు లను, వైశ్యులను ఇంగ్లిష్‌ విద్య విముక్తి చేసి పడేసింది. ఈరోజు దేశంలోని బడా బడా బనియా పారిశ్రామిక వేత్తలు ఇంగ్లిష్‌లోనే వ్యవ హరాలు నడిపిస్తున్నారు. పైగా ప్రపంచ స్థాయి ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు, కళాశాలలను నడుపుతున్నారు. మరి హిందీ సమర్థకులైన అమిత్‌ షా వాటిని మూసివేయాలని ప్లాన్‌ చేస్తున్నారా?

భారతదేశంలోని శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ను అలవర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ వారిలో అంత ర్జాతీయ జాబ్‌ మార్కెట్లో ప్రవేశించాలనే కనీస ఆశను కూడా తుంచే యాలని అమిత్‌షా కోరుకుంటున్నారు. దేశం లోపల కూడా ఇంగ్లిష్‌ను మాట్లాడే, రాసే సామర్థ్యం లేకపోవడం కారణంగానే ఈ కమ్యూని టీలకు ప్రైవేట్‌ రంగం ఉద్యోగాల్లో స్థానం లేకుండా పోతోంది. వీరు ఇంగ్లిష్‌ను మాట్లాడలేకపోతే, వారు దాన్ని ఎలా నేర్చుకోగలు గుతారు?

ఈ ఇంగ్లిష్‌ విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణ మూలాలు కలిగిన కమలా హారిస్‌ ఏకంగా అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కాగలిగారు. సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ సీఈఓ కాగలిగారు. ఇది మాత్రమే కాదు... వారిలో పటిష్టంగా ఉన్న ఇంగ్లిష్‌ మీడియం విద్య కారణంగానే తమిళ బ్రాహ్మణులు చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థానాలను చేజిక్కించుకోగలిగారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉంటున్న నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్న ఎస్‌.జైశంకర్‌ ఆ ఇంగ్లిష్‌ విద్యా వారసత్వానికి కొనసాగింపు గానే నిలుస్తున్నారు.

ఇంతేకాదు. అమిత్‌షా దేశాన్నే దహించివేయగల మరొక ఎజెండాపై కూడా కృషి చేస్తున్నారు. విస్తరించిన ఇంగ్లిష్‌ భాషా పునాది సహాయం తోనే భారత్, చైనా దేశాలు నేడు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడుతు న్నాయి. జాతీయవాద వాగాండబరం ఎలా ఉన్నా, అది ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వ్యతి రేకంగా ప్రభావం కలిగించిందంటే... భారతదేశం మళ్లీ అనివార్యంగా వెనక్కు వెళ్తుంది. జాగ్రత్త!

కంచె ఐలయ్య షెపర్డ్‌, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top