వినోద సేవలతోనూ... కాలుష్యమే!

Climate Pollution: Netflix Streaming Videos Creates Co2 - Sakshi

అత్యంత ప్రజాదరణ పొందిన తన సిరీసులను యూజర్లు ఎన్ని గంటలపాటు వీక్షిస్తున్నారనే అంశంపై నెట్‌ఫ్లిక్స్‌ అరుదైన విషయాన్ని ఇటీవలే బయటపెట్టింది. స్క్విడ్‌ గేమ్, స్ట్రేంజర్‌ థింగ్స్, మనీ హీస్ట్, బ్రిడ్జర్‌టన్‌తోపాటు తాను ప్రసారం చేస్తున్న 10 అగ్రశ్రేణి షోలను 600 కోట్ల గంటలపాటు ఫ్యాన్స్‌ తిలకిస్తున్నారని వెల్లడించింది. పాపులర్‌ షోలను ప్రసారం చేశాక, తొలి 28 రోజుల్లో దాన్ని అభిమానులు వీక్షించిన గంటల లెక్క ఇది. ఈ స్ట్రీమింగ్‌ మొత్తంగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది. డీస్నీ నుంచి యూట్యూబ్‌ దాకా ఇలా జనరంజకమైన వినోద సేవల విస్ఫోటనం... భూమ్మీద కర్బన ఉద్గారాలకు కారణమై, వినాశకరంగా మారుతోంది. ఈ షోలకు పెరుగుతున్న జనాదరణ భూగోళంపై చూపుతున్న దుష్ప్రభావం చర్చ రేపుతోంది. దీనికి స్ట్రీమింగ్‌ పరిశ్రమ, వినియోగదారులు పరిష్కారం వెతకాల్సి ఉంది.

వీడియో స్ట్రీమింగ్‌కి ఒక నిగూఢ రహస్యం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ చానెల్‌లో 10 అగ్రశ్రేణి గ్లోబల్‌ టీవీ హిట్‌ సీరియల్స్‌ని ఒక నెలపాటు అభిమానులు చూడటం ద్వారా ఉత్పత్తవుతున్న కర్బన ఉద్గారాలు... ఒక కారులో శనిగ్రహానికి అవతలవరకు డ్రైవ్‌ చేసుకుంటూ పోతే ఏర్పడే కర్బన ఉద్గారాలతో సమానం. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్‌ సైట్‌ యూట్యూబ్‌ ఒక ఏడాదిలో వెలువరించే గ్రీన్‌హౌస్‌ వాయువుల పరిమాణం, గ్లాస్‌గో నగరంలో ఒక సంవత్సరంలో వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువులను మించిపోతోంది. 

నేటి నుంచి ఈ స్కాటిష్‌ నగరంలోనే జరగనున్న వాతావరణ సదస్సు(కాప్‌26)కు ప్రపంచ నేతలు హాజరు కానున్నారు. విమానయానం, ఆటోమోటివ్, ఆహార రంగాల్లో అత్యధికంగా సీవో2 ఉద్గారాలు వెలువడుతుండటంపై ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు, కానీ డీస్నీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వరకు జనరంజకమైన వినోద సేవల విస్ఫోటనం... భూమ్మీద స్ట్రీమింగ్‌ బూమ్‌ ఎంత వినాశకరంగా మారుతోందనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక డివైస్‌లోని కంటెంటును తిలకించడానికి భారీ ఎత్తున డేటా సెంటర్లను ఉపయోగించడంతోపాటు, వైఫై, బ్రాడ్‌ బ్యాండ్‌ ద్వారా ట్రాన్స్‌మిషన్‌ వరకు ఒక వీడియోను స్ట్రీమ్‌ చేయడానికి అవసరమయ్యే ప్రతి చర్యకూ కావలసింది విద్యుత్తు. ఈ విద్యుత్‌లో చాలా భాగం గ్రీన్‌హౌస్‌ వాయువులను వెలువరించడం ద్వారానే ఉత్పత్తవుతోందని గ్రహించాలి.

స్ట్రీమింగ్‌ పరిశ్రమపై పర్యావరణ ప్రభావం చాలా కొత్త విషయ మని ‘గ్రీనింగ్‌ ఆఫ్‌ స్ట్రీమింగ్‌’ వ్యవస్థాపకుడు డామ్‌ రాబిన్‌సన్‌ చెప్పారు. ఈ సంస్థ వీడియో స్ట్రీమింగ్‌ రంగంపై ఎనర్జీ ప్రభావాన్ని పరిశీలిస్తుంది. స్ట్రీమింగ్, గేమింగ్‌ సేవల కోసం పెరుగుతున్న డిమాండ్‌ ద్వారా ఇంటర్నెట్‌ ట్రాíఫిక్‌ విషయమై ఏర్పడుతున్న తీవ్రమైన పోటీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కానీ, ఈ రంగానికి అసాధారణ సామర్థ్యం ఉంది. అయితే విద్యుత్‌ సరఫరా కోసం పెరుగుతున్న డిమాండే నిజానికి పెద్ద సమస్య’ అన్నారు రాబిన్‌సన్‌.

ఒక యూజర్‌ ఒక గంట వీడియో స్ట్రీమింగ్‌ చేస్తే అది 100జి (కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ని సూచించే యూనిట్‌) కార్బన్‌ డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని నెట్‌ఫ్లిక్స్‌ అంచనా వేసింది. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, ప్రతి గంట వీడియో స్ట్రీమింగ్‌ కోసం 55జి లేక 56జి యూరోపియన్‌ సగటు సీవో2 ఉత్పత్తవుతుందని కార్బన్‌ ట్రస్ట్‌ సంస్థ పేర్కొంది. ఇది ఒక కారులో 300 మీటర్లు డ్రైవ్‌ చేస్తే వెలువడే కార్బన్‌ ఉద్గారాలకు సమానం. ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన అత్యంత ప్రజాదరణ పొందిన తన సీరియల్స్‌ని యూజర్లు ఎన్ని గంటలపాటు వీక్షిస్తున్నారు అనే అంశంపై నెట్‌ఫ్లిక్స్‌ అరుదైన విషయాన్ని ఇటీవలే బయటపెట్టింది.

స్క్విడ్‌ గేమ్, స్ట్రేంజర్‌ థింగ్స్, మనీ హీస్ట్, బ్రిడ్జర్‌టన్‌తోపాటు తాను ప్రసారం చేస్తున్న 10 అగ్రశ్రేణి షోలను 600 కోట్ల గంటలపాటు ఫ్యాన్స్‌ తిలకిస్తున్నారని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఒక జనరంజకమైన షోను ప్రసారం చేశాక తొలి 28 రోజుల్లో దాన్ని అభిమానులు వీక్షించిన గంటల లెక్క ఇది. దీన్ని మరోవిధంగా చెప్పుకుంటే షాక్‌ కలగక మానదు. కార్బన్‌ ట్రస్ట్‌ సంస్థ అంచనా ప్రకారం, ఇది ఒక కారులో 180 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించడానికి అయ్యే ఇంధన వ్యయానికి సమానం. భూమికి, శనిగ్రహానికి మధ్య ఇంతే దూరం ఉందని గ్రహించాలి.

ఇక యూట్యూబ్‌ విషయానికి వస్తే, 2016లో ఈ సంస్థ స్ట్రీమింగ్‌ సైట్ల వాడకంపై అంచనాల ఆధారంగా బ్రిస్టల్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన నివేదిక ప్రకారం, యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌ సైట్లలో వీడియోలను తిలకించడం ద్వారా ఒక ఏడాదిలో 11 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువగా కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తోందని సమాచారం. అంటే గ్లాస్‌గో లేదా ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరాలు ఉత్పత్తి చేస్తున్న సీఓ2కి ఇది సమానం. ఆ సంవత్సరం యూట్యూబ్‌కి 140 కోట్లమంది యూజర్లు ఉండేవారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 240 కోట్ల మంది యూజర్లు ఏర్పడ్డారు. అంటే ఈ ఒక్క సంస్థ వెలువరిస్తున్న కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ ఈరోజు మరింత ఎక్కువగా ఉంటుంది.

గ్రీన్‌హౌస్‌ వాయువులను 2022 చివరినాటికి జీరో స్థాయికి తగ్గిస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్‌ వంటి అతిపెద్ద సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు కూడా కొన్నేళ్లుగా ఈ రకంగానే పర్యావరణ అనుకూల ఆకాంక్షలను ప్రకటించాయి. ఇక బ్రిటన్‌లో బీటీ, బీబీసీ, స్కై వంటి కంపెనీలు 20, 30 సంవత్సరంలోగా గ్రీన్‌హౌస్‌ వాయువులను జీరో స్థాయికి తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.

అయితే కర్బన ఉద్గారాలను లేకుండా చేసే తటస్థ స్థాయిని సాధించాలని ఈ కంపెనీలు భావిస్తున్నట్లయితే, గ్రీన్‌ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడంతో ఆగిపోవడానికి బదులుగా, ఉద్గారాలను వీలైనంత ఎక్కువగా తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని రాబిన్‌సన్‌ చెప్పారు. నెట్‌ జీరో అనేది ఇప్పుడు సరికొత్త కార్బన్‌ టాక్స్‌ ప్రమాణంగా మారింది. ఇది నా సమస్య కాదు అని తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లోనే ఉద్గారాల తగ్గింపు అమలు కావాలి. ఊరకే ప్రకటనలతో జిమ్మిక్కు చేయకుండా ఈ సంస్థలు కాస్త విభిన్నంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ‘పర్యావరణ ప్రభావాలను తగ్గించడంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి స్ట్రీమింగ్‌ రంగంలోనే చాలా ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టే మేము గ్రీనింగ్‌ ఆఫ్‌ స్ట్రీమింగ్‌ సంస్థను స్థాపించాము. టెక్నాలజీ సైతం దీన్ని సాధ్యపడేలా చేస్తోంది’ అని రాబిన్‌సన్‌ చెప్పారు.

ఈ లక్ష్యసాధనలో చిక్కు సమస్య ఏమిటంటే, యూజర్లు షోలను తిలకిస్తున్నప్పుడు వెలువడే ఉద్గారాలను తగ్గించడం ఎలా అన్నదే. నెట్‌ఫ్లిక్స్‌ చెబుతున్న నెట్‌ జీరో ప్లాన్‌ తన కార్పొరేట్‌ కార్యకలాపాల ద్వారా, సినిమాలు, టీవీ షోల నిర్మాణం ద్వారా  వెలువడే కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటోంది. ఉద్గారాలను ఎలా అంచనా వేస్తారు అనే అంశంపై నెట్‌ఫ్లిక్స్‌ ఒక బ్లాగ్‌లో వివరించింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు,  టీవీ, ఐప్యాడ్, మొబైల్‌ ఫోన్‌ నిర్మాతల వంటి డివైస్‌ తయారీదారులు తాము వెలువరిస్తున్న ఉద్గారాల పట్ల తమకు తాముగా జవాబుదారీతనంతో ఉండాలని అది పేర్కొంది. వినియోగదారులు ఉపయోగించే డిజిటల్‌ సర్వీసులను కూడా కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ గణనలో పొందుపర్చకుంటే ఉద్గారాలను నియంత్రించి, తగ్గించే సామర్థ్యం తగ్గిపోతుందని బ్రిస్టల్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ సీనియర్‌ లెక్చరర్‌ డేనియల్‌ స్కైన్‌ పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ పెరుగుదల ఆకాశాన్నంటింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, యాక్టివిజన్‌ బ్లిజర్డ్‌ వంటి బ్యాండ్‌ విడ్త్‌ రంగంలో భారీగా సేవలను అందిస్తున్న కొన్ని సంస్థల ద్వారా డేటా కెపాసిటీ 80 శాతానికి చేరుకుంది. అయితే గంటసేపు వీడియో స్ట్రీమింగ్‌ ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల్లో అధికంగా ఇంటిలోనే ఏర్పడుతున్నాయని స్కైన్‌ పేర్కొన్నారు. ఇప్పుడు అతిపెద్ద పుట్‌ ప్రింట్‌ టీవీల నుంచే వస్తోంది. టీవీ ప్రసారాలే ఇప్పటికీ స్ట్రీమింగ్‌ కంటే జనాదరణ పొందుతున్నాయి కాబట్టి టీవీ ద్వారా ఉద్గారాలే ప్రమాదకరంగా మారుతున్నాయని తన అభిప్రాయం.

అదేసమయంలో ఆర్థిక వ్యవస్థలో స్ట్రీమింగ్‌ ద్వారా ఏర్పడే కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ సాంద్రత ఇప్పటికీ చాలా తక్కువగానే ఉందన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంది. హీటింగ్, వాహనాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అనేవి ఎక్కువగా ఉద్గారాలను ఏర్పరుస్తున్నాయని భావిస్తుంటాం. వీటిని మనం తక్కువగా చూడవలసిన పనిలేదు. అదే సమయంలో ఒక గంట పాటు సాగే వీడియో స్ట్రీమింగ్‌ కంటే ఎక్కువ కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌... పాల ప్రాసెసింగ్‌ పరిశ్రమలో తయారవుతోందన్న వాస్తవాన్ని కూడా మర్చిపోకూడదని బ్రిస్టల్‌ వర్సిటీ సీనియర్‌ లెక్చరర్‌ స్కైన్‌ హెచ్చరిస్తున్నారు.
– మార్క్‌ స్వేనీ (‘ది గార్డియన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top