కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?

Article On Contempt of Court Offense - Sakshi

విశ్లేషణ

భారత సంవిధానం ఆర్టికల్‌ 19(1)(ఎ)లో పౌరులందరికీ వాక్‌ స్వాతంత్య్రం ఉన్నా కోర్టు ధిక్కారం చేస్తే శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందంటున్నది. న్యాయ స్థానాల తీర్పులను సమం జసంగా విమర్శించవచ్చునని, వారికి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించకుండా అభిప్రాయ వ్యక్తీ కరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరిం చింది. రంజన్‌ గొగోయ్‌ లైంగిక వేధింపుల కేసును వేగంగా ముగించి బాధితురాలిని బయటకు గెంటి ప్రధాన న్యాయమూర్తిని నిర్దోషిగా ప్రకటించి నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో సహా చాలా మంది మౌనంగా ఉండడం కూడా భావవ్యక్తీకరణ హక్కు వినియోగమే. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదు. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరుమూసుకుని ఉండొచ్చు. 

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సివిల్‌ పర మైన తప్పిదం. న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు చెప్పి నందుకు కోపించి, కోర్టులోనే చెప్పు విసరడం, తిట్టడం, అరవడం పైపైకి వెళ్లడం కోర్టు ధిక్కార నేరాలు. కోర్టుకిచ్చిన ప్రమాణ పత్రాలలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోయినా కోర్టు ధిక్కా రమే. వీటితో పాటు నిందాత్మక విమర్శలు అనే నేరం మరొకటి ఉంది. మామూలు కేసుల విచారణ నింపాదిగా దశాబ్దాల పాటు సా..ఆ..ఆ..గుతుంది. కానీ రాజ్యాంగ అధికారాలను వినియోగించి పెద్ద న్యాయస్థానాలు కోర్టు ధిక్కారం కేసులు స్వీకరిస్తే, శరవేగంగా జరుగుతాయి. దీన్ని సమ్మరీ హియ రింగ్‌ అంటారు. కోర్టు ధిక్కారం కేసులో పెద్దగా రుజువు చేయవలసిన అంశాలేమీ ఉండవు. నింది తుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రింట్‌లోనో, వీడియో లోనో, సోషల్‌ మీడియాలోనో భద్రంగా ఉంటాయి. అబద్ధాలు చెప్పి రేప్‌లు హత్యలు చేయలేదని చెప్పు కోవచ్చేమో కాని ‘కోర్టు ధిక్కారమా నాకు తెలి యదు, నేను చేయలేదు’ అని తప్పించుకోలేరు. 

ప్రశాంత్‌ భూషణ్‌తోపాటు కోర్టుధిక్కారం కేసులో ట్విట్టర్‌ కంపెనీవారు కూడా నిందితులు. క్షమాపణతో వారు బయటపడ్డారు. అయితే రెండు ట్వీట్లను వారు మళ్లీ ప్రచారంలో పెట్టకూడదు.  ట్వీట్‌ కవులు, వాట్సాప్‌ విద్వాంసులకు ఇచ్చిన తీవ్ర మైన హెచ్చరిక సుప్రీంకోర్టు తాజా తీర్పు. సుప్ర సిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ రెండు ట్వీట్లు ఆయనను దాదాపు జైలుకు పంపేవే. రూపాయి జరిమానాతో ఆయనకు జైలు తప్పిపోయింది. సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల న్యాయస్థానం ప్రశాంత్‌ భూషణ్‌ నేరం చేశారని అందుకు ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నది. ఒకవేళ ఆ రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు సాధారణ జైలు జీవితం గడపాలని నిర్దేశించింది, బయటికి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయకూడదని నిషేధిం చింది. వీటికన్నా రూపాయి చెల్లించడం నయమని తెలిసి తమ ఉత్తర్వును వెంటనే పాటిస్తారని సుప్రీంకోర్టు చాలా కరెక్టుగా అంచనా వేసింది. కోర్టు ధిక్కారం చేసిన నేరగాళ్లందరినీ అంతే దయతో చూస్తుందని గ్యారంటీ లేదు. కొందరు ప్రముఖు లకు ఎక్కువ సమానత సమర్థనీయం అంటారు. ప్రశాంత్‌ భూషణ్‌ అన్నటువంటి మాటలే ఇదివరకు కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టు యాభైరూపాయల జరిమానాతో ముగించింది. మన తెలుగు నేత శివశంకర్‌ కేంద్రంలో న్యాయశాఖ మంత్రి ఓ అడుగు ముందుకు వేసి ‘‘ఫెరా ఉల్లంఘించే వారికి, వధువు లను తగలబెట్టేవారికి, జమీందార్లకి మన సుప్రీం కోర్టు స్వర్గం వంటిది’’ అన్నారు. కానీ అది ఒక అభిప్రాయం, విమర్శ అనీ, కోర్టు ధిక్కారం ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు వదిలేసింది. శివశంకర్‌ అన్నారుకదా అని మనమెందుకు రాయకూడదని ఫేస్‌బుక్, ట్విట్టర్లలో టకాటకా కామెంట్లు కొడితే చకచకా కటకటాలకు పోవలసి వస్తుంది. రాజ ద్రోహ, కోర్టు ధిక్కార నేరం వంటి ఈ భయానక శాసనాలు బ్రిటిష్‌ పాలకులకు అవసరమయ్యాయి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలు ఈ నేరాలను తీసేసి నాగరికు లయ్యారు. మనమే ఇంకా రాజభక్తితో ఈ నేరాలను బతికించి స్వేచ్ఛాజీవులుగా మరణిసు ్తన్నాం. పౌరసమాజం– ఈ అన్యాయ, బానిస, భయానక, అప్రజా స్వామిక నేర శాసనాలను సంవిధానపు పునాదుల నుంచి నిర్మూ లించేందుకు ఉద్యమాలు నిర్మించాల్సిందే. 

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌   బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top