‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి? | Sakshi
Sakshi News home page

‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?

Published Tue, Jan 31 2023 12:34 PM

Madabhushi Sridhar Write on Supreme Court of India Collegium - Sakshi

మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్‌ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్‌ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్‌ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది.  

సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు.

కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు.

కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్‌ వేదికగా ఆయన అన్నారు. 

‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్‌ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్‌ఖర్‌ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు.

అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్‌లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్‌ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి...  స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు.   

రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు కాకుండా చీఫ్‌ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా?

- మాడభూషి శ్రీధర్‌ 
డీన్, స్కూల్‌ ఆఫ్‌ లా, మహీంద్రా యూనివర్సిటీ

Advertisement
 
Advertisement
 
Advertisement