రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే

Electoral bond scheme transparent: Govt to SC - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా..  సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు.

‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్‌ వేసిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ ఎన్‌జీవో తరఫున హాజరైన లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్‌ తరఫున వాదిస్తున్న లాయర్‌ కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు.

దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్‌ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్‌ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top