
అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది.
సీఆర్‌పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్‌ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
చెప్పారా, చెప్పించారా?
నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది.
‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు.
సహ నింద భరించే గతి!
నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి.
మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)
సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్‌డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది.
అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.
మన ‘కొత్త’ నేర చట్టాలు
మన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు.
ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్‌లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు.
భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు.
అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్‌బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్‌సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.
బెదిరిస్తే, ప్రలోభ పెడితే...
నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్