ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం

Professor Madabhushi Sridhar Guest Column On Lakhimpur Kheri Incident - Sakshi

సందర్భం

అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. 

మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్‌ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. 

సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్‌ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్‌. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. 

అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. 

నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్‌ క్వీన్స్‌ కౌన్సిల్‌గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్‌ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్‌ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు ఆశీష్‌ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్‌ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు!

దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్‌ చేయాలని శిరోమణి అకాలీదళ్‌ డిమాండ్‌ చేస్తున్నది. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్‌ చేయగానే డిస్మిస్‌ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు?

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్‌యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్‌ గాంధీ ట్వీట్‌ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్‌ 7న తొలగించేశారు. ఇక అంతర్‌ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది!


మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త డీన్, స్కూల్‌ ఆఫ్‌ లా, 
మహీంద్రా యూనివర్సిటీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top