తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!

Anil Kumar Kaile Write on Gadapa Gadapa Ku Mana Prabutvam - Sakshi

సందర్భం

అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది.

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్‌తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. 

రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది.

సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్‌ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. 

అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్‌ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్‌ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. 

చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి... అందులో బైజూస్‌ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్‌ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్‌! హ్యాండిల్‌ విత్‌ కేర్‌...)


- కైలే అనిల్‌ కుమార్‌ 
ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top