అది వారి హక్కు! వేసే ‘ముష్టి’ కాదు!!

ABK Prasad Guest Column On Women Rights - Sakshi

రెండో మాట

జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా పాలకులకు చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు న్యాయస్థానాల్లోనూ 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వక్కాణించారు. అయితే, భారత సమాజం ప్రగతిశీలకం కావడానికి  ఏ మార్పుల్ని ఆశిస్తున్నామో, ఆ మార్పులకు యువ సీఎం వైఎస్‌ జగన్‌ నవరత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి ప్రశంసలు పొందుతున్నారని మరచిపోరాదు. ఈ సంస్కరణలు అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా కొనసాగుతున్నాయని గుర్తించాలి. భర్త బూర్జువాగా, భార్య శ్రమజీవి అయిన కార్మికురాలిగా ఉంటున్న స్థితి పోవాలంటే ఆకాశంలో సగానికి అన్నింటిలోనూ సగభాగం దక్కాల్సిందే మరి!

భిన్నత్వంలో ఏకత్వమంటే అర్థం ఏమిటి? భిన్నత్వమంటే అసమానతా కాదు, ఒకర్ని తక్కువగాను, ఇంకొకర్ని ఎక్కువగానూ చూడడం కాదు. ప్రకృతి ముందు ఏదీ, ఎవరూ ఒకరికన్నా ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు గదా! ఆ లెక్కన నిప్పు ఎక్కువా, నీరు ఎక్కువా? ప్రకృతిలోని పక్షులు, సీతాకోక చిలు కలు, జంతువులు, చీమలు, ఏనుగుల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే సముద్రాలు, కొండలు, గ్రామాల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? చలికాలం, వేసవి, వానాకాలం, వసంత రుతువుల్లో ఏది గొప్పది, ఏది కాదు? ఒక్కముక్కలో పగలు, రాత్రి, ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే ఈ కుటుంబాలలో కూడా ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి ఎవరి స్థానం వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. అందువల్ల సమా జంలో సమానన్యాయం, సమానత్వం లేకపోతే సామూహిక సద్వర్తనం దుర్లభం. అందువల్ల విభిన్న వ్యక్తుల మధ్య ఐక్యత అనేది పరస్పర న్యాయం, సదవగాహన, గౌరవం ఉన్నప్పుడే సాధ్యం.

1970లలో మహిళా హక్కుల కోసం నిరంతరం, పోరుసల్పుతూ వచ్చిన తొలి భారత మహిళా నాయకులలో ఒకరుగా సామాజిక శాస్త్ర వేత్త కమలా భాసిన్‌ సుప్రసిద్ధురాలు. ఆమె వెలిబుచ్చిన భావాలతో ఏకీభవిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గత కొద్ది రోజులుగా దేశంలోని మహిళా హక్కుల రక్షణ గురించి నొక్కి చెబుతున్నారు. వలస పాలనావశేషంగా మిగిలి పోయిన భారతదేశ ప్రస్తుత న్యాయవ్యవస్థను స్వతంత్ర భారత న్యాయవ్యవస్థగా రూపొందించుకోవలసిన అవసరం గురించి ఆయన ప్రస్తావించడం ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపయోగకారి. గత నెల చీఫ్‌ జస్టిస్‌ చేసిన రెండు ప్రకటనలూ, నూతన మార్గంలో దేశ ప్రగతిని ఆశిస్తున్న అభ్యు దయ శక్తులలో మరింత చైతన్యానికి దోహదపడగల అవకాశం ఉంది. దేశం 75 ఏళ్ళ అమృతోత్సవం జరుపుకుంటున్నవేళ, దేశ చట్టసభలలో ఇన్నేళ్లుగా జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు కనీసం ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజుకీ పాల కులకు చేతులు రాని దుస్థితిలో ప్రధాన న్యాయమూర్తి దేశంలోని మహిళలందరికీ న్యాయస్థానాల్లో 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని స్థిరంగా ప్రకటించారు!

దేశంలోని ప్రస్తుత న్యాయవ్యవస్థను సామ్రాజ్యవాద వలస పాల కులు ప్రవేశపెట్టి, స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ పురోగతికి అవ రోధం కలిగించి ‘భారతీయ న్యాయవ్యవస్థ’గా రూపొందకుండా చేశారు. దాని ఫలితంగా భారత సమాజం ఆచరణలో ఎదుర్కొం టున్న పెక్కు సమస్యలను చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అనేక ఉదాహర ణలతో ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. ‘‘నేడు ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలోని సామాన్య పౌరులు  తమ అభిప్రాయాలకు కోర్టులలో విలువలేదని భావిస్తున్నారు. వాద ప్రతివాదాలు అంతూ పొంతూ లేకుండా సుదీర్ఘంగా కొనసాగడం, సామాన్య కక్షిదారులకు ఖర్చులు తడిసిమోపడవుతుండడం, పైగా ప్రసంగాలు వారి మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్‌లో కొనసాగు తూండడం, ఇక తీర్పులైతే సుదీర్ఘంగా సాగడం లేదా అర్థం కాని అతి సాంకేతిక పదజాలంతో ఉండడం వంటి కారణాలతో ఇవి రొడ్డ కొట్టుడుగా తయారవుతూ వచ్చాయి.’’ అందువల్ల వలస పాలనావ శేషంగా సంక్రమించిన ఈ మైకం నుంచి మన న్యాయస్థానాలు ఇక నైనా మేలుకొని మన న్యాయవ్యవస్థ దేశీయ ప్రయోజనాల రక్షణకు నడుం కట్టవలసిన సమయం వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి (19–9–2021) వక్కాణించారు.

మన కోర్టుల్ని చూసి, న్యాయమూర్తులను చూసి న్యాయాన్ని ఆశించి వచ్చే పేదలు బెదిరిపోని పరిస్థితులు రావాలనీ, పేదసాదలకు నిర్మొహమాటంగా వాస్తవాల్ని ప్రకటించుకునే భాగ్యం కలగాలనీ ఆయన ఆశిస్తున్నారు!  ఎందుకంటే, ఈ రోజు దాకా మనం అనుస రిస్తూ, ఆచరిస్తున్న విధానాలు, న్యాయసూత్రాలూ వలస పాలనా రోజుల నాటివి కనుకనే ఆచరణలో స్వతంత్ర భారత సమాజ పౌరుల వాస్తవ పరిస్థితులకు పరమ విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం సరికొత్తగా ఆయన మరో బాంబు వదిలారు. దేశ న్యాయ వ్యవస్థలో కూడా 50 శాతం స్థానాలు మహిళ లకే ఉండాలని, అది వారి హక్కేగాని ‘దానధర్మం’ కాదని మొదటి సారిగా ప్రకటించడమే కాదు... వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైన మహిళలు ఈ హక్కుకు అర్హులని చెబుతూ శాస్త్రీయ సోషలిజం పితామహుడు, కమ్యూనిస్టు మానిఫెస్టో సిద్ధాంత కర్త  కారల్‌మార్క్స్‌ ప్రపంచ కార్మిక లోకాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ, ‘ఏకమై ఉద్యమిం చండి మీకు సంకెళ్ళు తప్ప కోల్పోయేదేమీలేదు...’ అన్న చరిత్రాత్మక సందేశాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మహిళల్లారా ఐక్యంగా ఉద్యమిం చండి, మీరు కోల్పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప అని మహిళల పరంగా ఉద్బోధించడం ఓ కొత్త మలుపు.

ఈ సందర్భంగా ఒక సమకాలీన సత్యాన్ని మరుగున పడకుండా ఉదాహరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన న్యాయమూర్తి భారత సమాజం ప్రగతిశీలం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నారో, ఆ మార్పులకు ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ముందుగానే ముందుచూపుతో యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవ రత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని మరచి పోరాదు. ఈ సంస్కరణలు కులాలతో, మతాలతో పార్టీలు, ప్రాంతా లతో సంబంధం లేకుండా సకల ప్రజా బాహుళ్యంలోని అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా నమోదవుతున్నాయని మరిచిపోరాదు.

ఈ సంస్కరణలు మార్క్స్, అంబేడ్కర్, మౌలానా ఆజాద్‌ భావాల మేలుకలయిక. అందుకే మార్క్స్, ఎంగెల్స్‌లు అన్నారు. ‘ధనిక వర్గసమాజపు కుటుంబ వ్యవస్థలో భర్త ఆనే వాడు భార్యపై దాష్టీకం చెలాయించగల ఒక బూర్జువా అయితే, భార్య శ్రమజీవి అయిన ఒక కార్మికురాలు (ప్రొలిటేరియట్‌). ఎందుకంటే, ధనికవర్గ సామాజిక వ్యవస్థలో న్యాయచట్టాలనేవి, ఆ వ్యవస్థపై పెత్తనం ఏ వర్గం చెలాయిస్తుం టుందో ఆ వర్గ ప్రయోజనాలనే తు.చ. తప్ప కుండా కాపాడటానికి ఎలాంటి ‘కొత్త’కి చోటివ్వని న్యాయచట్టాన్నే కోరుకుంటాయి. అందుకే ‘ప్రజల హక్కు’ అన్న భావననే అది సహించదు పైగా చంపేస్తుంది’.

కనుకనే ‘పెట్టుబడి అనేది ఇతరుల శ్రమ ఆధారంగా బతకజూసే నిర్జీవ పదార్థం. శ్రమజీవుల శ్రమపై బతికేదే పెట్టుబడి. అలా ఎన్నాళ్లు బతికితే అన్నాళ్లూ ఇతరుల శ్రమను దోచుకుని బలుస్తూనే ఉంటుం ద’ని మార్క్స్‌ సూత్రీకరించారు. అందుకే ఆయనను ఆధునిక అరి స్టాటిల్‌ అన్నారు. మానవుణ్ణి మార్క్స్‌ మొత్తం తాత్విక ప్రపంచానికే కేంద్ర బిందువుగా చేశాడు. ఇంతవరకు తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని భిన్న కోణాల నుంచి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మన కర్తవ్యం మానవుణ్ణి తాత్వికకోణానికి కేంద్ర బిందువును చేసి యావత్తు మానవాళిని ఉన్నత స్థానంలో నిలిపి మానవ ప్రగతికి అతడినే మూల కారణం చేయాలి. అదొక్కటే... స్వార్థపరులు మాన వాళి అణచివేతకు ఎక్కుపెట్టిన దుష్టశాసనాలను బదాబదులు చేయ గల ‘పాశుపతాస్త్రం’ అని మార్క్స్‌ 150 ఏళ్లకు ముందే ప్రవచించాడు. ఆ సంగతి మరవరాదు. ‘మహిళా విమోచన’ అనేది యావత్తు మానవాళి స్వేచ్ఛకోసం వేసే తొలి అడుగు అని మార్క్స్‌ నిర్వచించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి ఏళ్లూ పూళ్లూ గడిపినా దేశ రాజకీయ (వి)నాయకులకు మాత్రం నేటికీ మనసొప్పడం లేదు. ఎందుకని? ‘పుచ్చిపోతున్న విత్త నాలను బతికించలేమ’న్నది సామెత.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top