పిల్లల కథ: ఎవరికి విలువ?

Kids Story: Individual Values, Personal Values, Happy Life, Healthy Society - Sakshi

 మొర్రి గోపి

ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. 

‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది.  

‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత  బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. 

అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది.

మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top