వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్‌! మొత్తం కంటినే మార్పిడి..

World's First Whole Eye Transplant Performed In US - Sakshi

వైద్యశాస్త్రంలో మరో అద్భుతమైన ఫీట్‌ని సాధించింది. ఇంతవరకు సాధ్యం కానీ అరుదైన పూర్తి స్థాయి కంటిమార్పిడి శస్త్ర చికిత్సను చేసి చరిత్ర సృష్టించారు వైద్యులు. దీంతో భవిష్యత్తులో అంధుల కళ్లల్లో వెలుగును ప్రసాదించేలా సరికొత్త వైద్య విధానానికి నాంది పలికారు. ఏంటా అరుదైన శస్త్ర చికిత్స తదితరాల గురించే ఈ కథనం!.

వైద్యశాస్త్రంలో ఇంతవరకు మొత్తం కంటిని మార్పిడి చేయండం సాధ్యం కాలేదు. అలా అయితే చాలామంది చనిపోయేటప్పుడూ కళ్లు దానం చేస్తున్నారు కదా అని అడగొచ్చు. అదీగాక కొందరూ పేషెంట్లు కన్నుమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాం అంటారు కదా! అనే సందేహం కూడా మనకు వస్తుంది. కానీ అది కన్నుమార్పిడి చికిత్స కాదు జస్ట్‌ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్‌ లేదా కార్నియల్‌ గ్రాఫ్టింగ్‌​ అంటారు. కంటికి ఏదైన గాయం లేదా వాపు కారణంగా మచ్చలు తీవ్ర స్థాయిలో ఏర్పడి చూపుపై ప్రభావం ఏర్పడవచ్చు లేదా దృష్టి లోపం రావచ్చు. అలాంటప్పుడు దాత నుంచి స్వీకరించిన కార్నియాను నేత్ర వైద్యుడు పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తాడు. స్పష్టమైన దృష్టికి కార్నియా అత్యంత ముఖ్యం. అంతే గానీ పూర్తి స్థాయిలో కంటిని అమర్చడం అనేది సాధ్యం కాదు. 

ఎందుకంటే? మన కళ్లు చిత్రాన్ని బంధించే కెమరాలాంటివే. కానీ మన మెదడు వాటిని ప్రాసెస్‌ చేసి ఆ వస్తువు ఏంటీ? అనేది ఐడెంటిఫై చేయగలదు. అంటే మన మెదడుతో కన్ను అనుసంధానమైతేనే చూడగలం. ఇక్కడ కంటి నుంచి మెదడుకు దృశ్యమాన సంకేతాలను పంపే ఆప్టిక్ నాడి ద్వారా మన కళ్ళు అనుసంధానించి ఉండటం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల కన్ను అనేది మెదడుకు ఆప్టిక్‌ నరాలతో అనుసంధానించి ఉన్న సంక్లిష్ట అవయవం. ప్రమాదవశాత్తు ఈ నరాలు తెగిపోయిన లేదా దెబ్బతిన్న చూపు తెప్పించడం అనేది అసాధ్యం.

ఈ ఆప్టిక్‌ నరాలు పరిమాణం పరంగా చిన్నవే అయినప్పటికీ.. కంటి నుంచి మెదడుకు మిలియన్లకు పైగా చిన్న నరాలు కనెక్ట్‌ అయ్యి ఉంటాయి. పొరపాటున తెగితే అతుక్కోవు. అందువల్ల మొత్తం కంటిని మార్పిడి చేయలేరు వైద్యులు. ఒకవేళ వైద్యలు మొత్తం కంటిని మార్పిడి చేసినా.. మెదడుకి కనెక్ట్‌ చేయడం అనేది కుదరదు. దీంతో ఆ కన్ను దృశ్యమాన సంకేతాలను మెదడకు పంపలేదు కాబట్టి రోగికి చూపు రావడం అనేది అసాధ్యం. అలాంటి అసాధ్యమైన సంక్లిష్ట శస్త్ర చికిత్సనే చేసి అరుదైన ఘనత సాధించారు అమెరికా వైద్యులు. ఇంతకీ ఆ వ్యక్తి చూపు వచ్చిందా? ఎలా మెదడుకు కంటిని కనెక్ట్‌ చేశారు చూద్దామా!

వివరాల్లోకెళ్తే..46 ఏళ్ల ఆరోన్‌ జేమ్స్‌ సరిగ్గా 2021లో దాదాపు ఏడు వేల వోల్ట్‌ల విద్యుత్‌ వైర్లు అతని ముఖాన్ని తాగడంతో మెత్తం ఎడమ భాగం అంటే.. అతడి ఎడమ కన్ను, మోచేయి, ఎడమ చెంప, గడ్డంకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ముఖ పునర్నిర్మాణం కోసం అమెరికాలోని లాంగోన్ ఆస్పత్రికి తరలించగా.. మే 27న అతడికి శస్త్రచికిత్స చేశారు. ఐతే ఈ ప్రమాదంలో అతను ఎడమవైపు కంటిని పూర్తిగా కోల్పోయాడు. అయితే వైద్య శాస్త్రంలో సవాలుగా ఉన్న మొత్తం కంటి మార్పిడి శస్త్ర చికిత్సపై పలు పరిశోధనలు జరగుతున్న తరుణంలో జేమ్స్‌ పరిస్థితి ఓ సువర్ణావకాశంలా వైద్యులకు అనిపించింది. ఇంతవరకు ఎలుకలపై చేసిన ప్రయోగాలు కొంత మేర ఫలితం ఇచ్చినప్పటికి వాటికి పాక్షిక దృష్టి మాత్రమే వచ్చింది. మెరుగైన చూపు మాత్రం రాలేదు.

ఇది సాధ్యమా కాదా! అనే ఆసక్తితో ఉన్న వైద్యులకు జేమ్స్‌ స్థితి కొత్త ఆశను చిగురించేలా చేసింది. అలాగే జీవించి ఉన్న వ్యక్తికి ఇంతవరకు ఇలాంటి ఆపరేషన్‌ చేయలేదు. దీంతో ఎడ్వర్డో రోడ్రిగ్జ్ వైద్యుల బృందం జేమ్స్‌కి ఈ సంక్లిష్టమైన పూర్తి స్థాయి కంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయాలనుకున్నారు. దాదపు 21 గంటలు శ్రమించి, త్రీడీ టెక్నాలజీ సాయంతో జేమ్స్‌కి ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. అతని ఎడమ కన్నులోని రెటీనాకు రక్తప్రసరణలో సహా కాంతి స్వీకరించి మెదడుకు సంకేతం పంపేలా చేయగలిగారు. మార్పిడి చేసిన ఎడమ కన్ను మంచి ఆరోగ్యంతో ఉన​ సంకేతాలు చూపినట్లు తెలిపారు. నిజానికి జేమ్స్‌కు తన చూపుని తిరిగి పొందగలడని కచ్చితంగా చెప్పలేం. కానీ తాము ఎన్నోఏళ్లుగా చూస్తున్న అద్భుతమైన ఫీట్‌ని మాత్రం చేయగలిగాం అన్నారు.

అతడి దృష్టికి వచ్చినా రాకపోయినా..ఈ ఆపరేషన్‌ మాత్రం తన 15 ఏళ్ల అనుభవంలో చాలా అతిపెద్ద ప్రయోగమని అన్నారు కొలరాడో అన్‌స్చుట్జ్‌ మెడిల్‌ ప్రోఫెసర్‌ కియా వాషింగ్టన్‌. ఇక జేమ్స్‌ తనకు జీవితంలో రెండో అకాశం కల్పించిన దాతకు అతని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అతను నెలవారి చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐతే శస్త్రచికిత్స తర్వాత గడిచిన సమయాన్ని బట్టి, జేమ్స్ కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ చికిత్సలో కన్ను మెదడుకు కనెక్ట్‌ అయ్యేలా ఆప్టిక్‌ నరాలను పనరుత్పత్తి చేయడమే గాక ఆ నరాలు మెరుగ్గా పనిచేసేలా ఎముక మజ్జలోని మూల కణాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం ఫలిస్తే భవిష్యత్తులో అంధులకు దృష్టిని ప్రసాదించగలిగే  సరికొత్త వైద్య విధానానికి నాంది పలకగలుగుతామని అన్నారు వైద్యులు. 

(చదవండి: చెఫ్‌ కాదు టెక్‌ జీనియస్‌!)

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top