World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు

World Cup 2023: India vs Australia Final Match Sentiments On Amitabh Bachchan  - Sakshi

క్రికెట్‌ జ్వరం

అమితాబ్‌ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్‌ చూడకండి సార్‌’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు.

న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్‌ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్‌. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్‌ చూద్దామా..

‘జులాయి’ సినిమాలో ఒక సీన్‌ ఉంటుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్‌ తన ఫ్రెండ్‌ యాంకర్‌ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్‌ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్‌.

మనవాళ్ల సెంటిమెంట్స్‌ ఇలా ఉంటాయి.
1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్‌ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్‌ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని.

నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్‌ పడింది. అందుకని మ్యాచ్‌ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్‌ హరీ’...

ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్‌ ఫీవర్‌ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్‌ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి.

ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్‌ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’...

అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్‌ అయినా క్రికెట్‌ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్‌ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్‌ చూడ్డానికి ఎగ్జయిట్‌ అవుతుంటే ఇండియా ఢమాల్‌ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ.

అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్‌లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్‌ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్‌ సీట్‌లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్‌. అక్కడే కూచునేవాణ్ణి. బార్‌వాళ్లు కూడా నా సీట్‌ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్‌లో మందైపోతే వికెట్‌ పడిపోతుందని ఒక సెంటిమెంట్‌. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్‌ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్‌ నిషా అభిమాని.

అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్‌ ఉంటాయి. టెస్ట్‌ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్‌ చేసినా, బ్యాటింగ్‌ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్‌ చేయకుండా మేచ్‌ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్‌ తెలిపాడు.

‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్‌ శ్రీశాంత్‌ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్‌ చెప్పాడు. సునీల్‌ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్‌ ఇచ్చి సున్నాకు ఔట్‌ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్‌ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది.

మొహిందర్‌ అమర్‌నాథ్‌ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్‌ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్‌ ఖాన్‌ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్‌ అశ్విన్‌ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్‌. ఇక అజారుద్దీన్‌ తావీజ్‌ లేకుండా మ్యాచ్‌ ఆడడు.

1987 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వే మీద కపిల్‌ దేవ్‌ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్‌ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్‌ రూమ్‌ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్‌ దేవ్‌ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్‌ మేనేజర్‌ మాన్‌ సింగ్‌ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు.

ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్‌ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్‌ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్‌ కప్‌ పోటీల్లో హోస్ట్‌ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్‌ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్‌.

మరోవైపు 2019 వరల్డ్‌ కప్‌ సమయంలో చంద్రయాన్‌–2 ఫెయిల్‌ అయ్యింది. ఇండియా కప్‌ కోల్పోయింది. 2023లో చంద్రయాన్‌ –3 సక్సెస్‌ అయ్యింది. అంటే మనం వరల్డ్‌ కప్‌ గెలుస్తామని ఒక సెంటిమెంట్‌. కాని ఆట ఎప్పుడూ టీమ్‌ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్‌ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది.

ఈసారి భారత్‌ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top